రాజయ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ మహిళా నేతల ధర్నా
రాజయ్య మహిళా కార్యకర్తల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తారని తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయని మహిళా కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు.
మాజీ ఉపముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లో చేరే విషయంలో కొత్త ట్విస్ట్. ఆయన్ను కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పలువురు మహిళా ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏకంగా గాంధీభవన్ ఎదుటే ఆందోళనకు దిగారు.
మహిళా కార్యకర్తల పట్ల అసభ్య ప్రవర్తన
రాజయ్య మహిళా కార్యకర్తల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తారని తీవ్రస్థాయిలో ఆరోపణలున్నాయని మహిళా కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. ప్రధానంగా ఆ కారణంతోనే బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సర్పంచి నవ్యతో వ్యవహారం రచ్చ
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికంగా వేధించారని ఆయన నియోజకవర్గ పరిధిలోని జానకీపురం సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణలు కూడా బహిర్గతమయ్యాయి. రాజయ్యపై సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు సుమోటోగా స్వీకరించాయి. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించాయి. మొన్నటి ఎన్నికల్లో రాజయ్యపై పోటీకి కూడా నవ్య సిద్ధమయ్యారు.
ఇలాంటి ఆరోపణలు గతంలోనూ రావడం రాజయ్య రాజకీయ జీవితాన్ని అనిశ్చితిలో పడేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరదామన్నా కూడా ఆ మహిళలే అడ్డుకోవడం గమనార్హం.