నాలుగు నెలల్లోనే తిరిగి టీఆర్ఎస్ గూటికి నల్లాల దంపతులు

ఇటీవల వేసిన కాంగ్రెస్ కమిటీలో ఓదెలుకు స్థానం కల్పిస్తారని అనుకున్నా.. సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తుండటంతో.. తిరిగి టీఆర్ఎస్‌లో చేరినట్లు సన్నిహితులు తెలిపారు.

Advertisement
Update:2022-10-05 12:31 IST

కాంగ్రెస్ పార్టీకి నల్లాల ఓదెలు దంపతులు షాక్ ఇచ్చారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి నాలుగు నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దంపతులు ఇద్దరూ కలసి ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ నాలుగు నెలలు తిరగక ముందే వాళ్లు టీఆర్ఎస్‌లోకి వచ్చారు. బుధవారం ప్రగతి భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వారిని ప్రగతి భవన్‌కు తీసుకొచ్చారు. వారి వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర నేతలు కూడా ఉన్నారు.

ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్‌ఎస్‌తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2018లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

కాగా, రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత టీఆర్ఎస్‌లోని అసంతృప్తులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఓదెలు దంపతులను ఒప్పించి పార్టీలోకి రావడానికి కృషి చేశారు. అయితే పార్టీలోకి వచ్చిన తర్వాత ఓదెలు దంపతులకు సరైన ఆదరణ లేకుండా పోయింది. ఇటీవల వేసిన కాంగ్రెస్ కమిటీలో ఓదెలుకు స్థానం కల్పిస్తారని అనుకున్నా.. సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తుండటంతో.. తిరిగి టీఆర్ఎస్‌లో చేరినట్లు సన్నిహితులు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News