ఆ కారణంతోనే నా బెయిల్‌ అడ్డగింత.. ఢిల్లీ హైకోర్టులో కవిత వాదనలు

తన బెయిల్‌ అప్లికేషన్లను కొట్టివేస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది.

Advertisement
Update:2024-05-28 09:42 IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేసే విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ నిబంధనలు ఉల్లంఘించిందన్నారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు సమన్లు జారీ చేయబోమని, సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పినప్పటికీ తనను ఈడీ అరెస్టు చేసిందన్నారు. కేవలం రాజకీయ నాయకురాలినన్న కారణంతోనే తనకు బెయిల్‌ రాకుండా ఈడీ అడ్డుపడుతోందన్నారు. సామాన్యులకున్న హక్కులు కూడా తనకు ఉండవా అని ప్రశ్నించారు.

తన బెయిల్‌ అప్లికేషన్లను కొట్టివేస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. కవిత తరఫున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. 2023 మార్చి 8న ఈడీ తొలుత సమన్లు జారీ చేసిందన్న కవిత.. CRPC సెక్షన్‌ 160 కింద సమన్లు జారీచేసి CBI ఇంటికొచ్చి విచారించిందని.. మీరూ అలాగే చేయాలని ఈడీని కోరానని చెప్పారు. అయితే కస్టడీలో ఉన్న వ్యక్తితో ముఖాముఖి విచారించాల్సి ఉందని, ఆఫీసుకు రావాల్సిందేనని అధికారులు తనకు చెప్పారన్నారు కవిత.

ఈడీ అధికారులు చెప్పింది నమ్మి 2023 మార్చి 11న ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్తే పొద్దుపోయే వరకూ కూర్చోబెట్టారని ఆరోపించారు కవిత. ఈడీ అధికారులు మొబైల్‌ ఫోన్లు అడగడంతో ఇచ్చానని చెప్పారు. అయితే ఫోన్‌లో పర్సనల్ విషయాలు ఉంటాయని, ఫోన్‌ను ఓపెన్‌ చేసే విషయంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశానన్నారు. ఈ కేసు పెండింగ్‌లో ఉండగానే మళ్లీ హాజరుకావాలని ఒత్తిడి చేయడంతో 2023 మార్చి 20న రెండోసారి ఈడీ ముందు హాజరయ్యానన్నారు కవిత. 2022 నవంబర్‌లో దాఖలుచేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఫోన్లు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారని చెప్పారు. యాపిల్‌ కొత్త మోడల్‌ వస్తే తాను ఫోన్‌ మార్చుతానని.. పాత వాటిని తన సిబ్బందికి ఇస్తూ వచ్చానని కోర్టుకు చెప్పారు కవిత.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను క్లియర్ చేయడానికి ఉద్యోగులకు ఇచ్చిన 11 పాత ఫోన్లను సేకరించి ఈడీకి ఇచ్చానన్నారు కవిత. అందులో 4 ఫోన్లు ఫార్మాట్ అయ్యాయన్నారు. వాటిని తీసుకున్న తన సిబ్బంది ఎందుకు ఫార్మాట్ చేశారో తనకు తెలియదన్నారు. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కవిత. 2023 సెప్టెంబర్‌లో ఈడీ సుప్రీంకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో తనను నిందితురాలిగా పేర్కొన‌లేదన్నారు కవిత. సెప్టెంబర్‌ నుంచి మార్చి మధ్యలో కొత్తగా ఏమీ జరగకపోయినా తనను అరెస్ట్‌ చేసి న్యాయప్రక్రియతో ఆడుకుంటున్నారని వాదనలు వినిపించారు. కొందరు రాజకీయ నేతలతో చేతులు కలిపి తనను పార్టీ మార్చడానికే ఇలా చేశారా.. అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా తన పరిస్థితిని గమనించి బెయిల్ మంజూరు చేయాలని కోరారు కవిత.

Tags:    
Advertisement

Similar News