ఇంకా ఆ ఆశ ఉందా రాజాసింగ్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు వదిలేస్తానని మరోసారి స్పష్టం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. స్వతంత్రంగా కానీ, ఇతర పార్టీల నుంచి కానీ పోటీ చేయనని స్పష్టం చేశారు.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై గతంలో సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ అధిష్టానం దాన్ని ఇంకా తొలగించలేదు. మరోవైపు ఎన్నికలకు టైమ్ ముంచుకొస్తోంది. ఈలోగా సస్పెన్షన్ ఎత్తివేసి, తనకు మళ్లీ గోషా మహల్ టికెట్ ఇస్తారని అంటున్నారు రాజాసింగ్. బీజేపీ అధిష్టానం తన విషయంలో సానుకూలంగా ఉందని చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పుకోవడమే కానీ, అటునుంచి మాత్రం ఉలుకూ పలుకూ లేదు. అసలు రాజాసింగ్ ని ఎవరూ పట్టించుకోవట్లేదు. పైగా ఆ సీటు విక్రమ్ గౌడ్ కి ఇస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే రాజాసింగ్ మాత్రం పట్టువదిలేలా లేరు. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలే వదిలేస్తానంటున్నారాయన.
గోషా మహల్ టికెట్ ని విక్రమ్ గౌడ్ కి ఇచ్చి, రాజా సింగ్ ని జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పంపించాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచన. ఈ ప్రతిపాదన ఆల్రడీ రాజాసింగ్ ముందుకు చేరినా ఆయన ససేమిరా అన్నారు. అందుకే సస్పెన్షన్ వేటు విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ విషయం తేల్చకుండా రాజాసింగ్ ని హోల్డ్ లో పెట్టింది. పైగా పార్టీ నాయకులు కూడా ఆయనతో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. విజయశాంతి ఒక్కరే రాజాసింగ్ సస్పెన్షన్ గురించి అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు.
పార్టీ మారేది లేదు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు వదిలేస్తానని మరోసారి స్పష్టం చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. స్వతంత్రంగా కానీ, ఇతర పార్టీల నుంచి కానీ పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనన్నారు. ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ లో చేరను అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఇంకా గోషామహల్ అభ్యర్థిని ఫైనల్ చేయకపోవడం విశేషం.
♦