'మన ఊరు-మన బడి'లో మారిన రూపురేఖలు.. నేడు 1,210 స్కూల్స్ ప్రారంభోత్సవం
'మన ఊరు-మన బడి', 'మన బస్తీ-మన బడి' కార్యక్రమంలో తొలి దశలో 100కు పైగా విద్యార్థులు ఉన్న 9,123 స్కూల్స్‌ను ఎంపిక చేశారు.
ప్రభుత్వ పాఠశాల అంటే శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగులు, విరిగిపోయిన బెంచీలు, అక్కరకు రాని మరుగుదొడ్లే గుర్తుకు వస్తాయి. కానీ, ఆ అపోహలన్నింటినీ తొలగించేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త హంగులు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ పాఠశాలల రూపూరేఖలు సమగ్రంగా మార్చే లక్ష్యంతో 'మన ఊరు-మన బడి', 'మన బస్తీ-మన బడి' అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన వాటిలో పనులు పూర్తయిన 1,210 పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మంత్రులు , ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభించనున్నారు. గంభీర్‌రావు పేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ ప్రారంభిస్తారు. అలాగే కందుకూరు మండలం రాచులూరు ఎంపీపీ స్కూల్‌ను సబిత ప్రారంభిస్తారు.
'మన ఊరు-మన బడి', 'మన బస్తీ-మన బడి' కార్యక్రమంలో తొలి దశలో 100కు పైగా విద్యార్థులు ఉన్న 9,123 స్కూల్స్‌ను ఎంపిక చేశారు. వీటిలో 5,399 ప్రైమరీ, 1,009 ప్రాథమికోన్నత, 2,715 హైస్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ రూ.30 లక్షల లోపు పనులే ఉండటంతో టెండర్లు లేకుండానే పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా పనులు చేపట్టారు. మొత్తం 12 రకాల మౌళిక సదుపాయాలను కల్పించారు. భవనాలకు మరమ్మతులు, రంగులు, ప్రహారీల నిర్మాణం, ఫర్నీచర్, డిజిటల్ తరగతులు, సోలార్ ప్యానల్ ఏర్పాటు, తాగునీరు, గ్రీన్ చాక్ పీస్ బోర్డులు, కిచెన్ షెడ్స్, టాయిలెట్ల నిర్మాణం, అదరపు తరగతి గదుల నిర్మాణం, హైస్కూల్స్‌లో డైనింగ్ హాల్, ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయి.
మండలానికి రెండేసి చొప్పున మోడల్ స్కూల్స్‌గా అభివృద్ధి చేశారు. అన్ని స్కూల్స్‌కు ఒకే రంగు ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. బయట ఒక రంగు, గదుల లోపల మరో రంగును ఎంపిక చేశారు. తొలి విడతలో 71,115 తరగతి గదులకు రంగులు వేశారు. ఒక్కో గదికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, నాలుగు ఫ్యాన్లు భిగించారు. ప్రైమరీ స్కూల్స్‌లో 30 మంది విద్యార్థులకు, హైస్కూల్స్‌లో 40 మంది విద్యార్థులకు ఒక తరగది చొప్పున 4,400 గదులను తొలి విడతలో ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,065 సర్కారు బడులలో మూడు దశల్లో 12 రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. రూ.7,289 కోట్లను 'మన ఊరు-మన బడి', 'మన బస్తీ-మన బడి' కోసం ప్రభుత్వం కేటాయించింది. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,123 స్కూల్స్ కోసం రూ.3,498 కోట్లు విడుదల చేసింది. వీటిలో పనులు పూర్తయిన 1,210 స్కూల్స్‌ను ఇవాళ ప్రారంభించనున్నారు.