బండీ..! నోరు జాగ్రత్త.. కామారెడ్డి ఎపిసోడ్ పై మంత్రి వేముల వార్నింగ్
రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా, ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరిచిందన్నారు. ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొక్కించి చంపిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది బీజేపీ. అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడంతోపాటు, పనిలో పనిగా రాజకీయ కుంపట్లు రగల్చాలని చూశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కలెక్టరేట్ ముట్టడి పేరుతో డ్రామా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. “బండి సంజయ్.. నీ నోరు జాగ్రత్త” అంటూ హెచ్చరించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన శాస్తి తప్పదన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని చెప్పారు.
ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నాయని మండిపడ్డారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. దేశంలో అత్యంత గొప్పగా గౌరవం తెలంగాణ రైతులకే దక్కిందని అన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా, ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరిచిందన్నారు. ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొక్కించి చంపిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు ప్రశాంత్ రెడ్డి. ఇలాంటి పనులు చేసిన వారు రైతు కోసం మొసలి కన్నీరు కారిస్తే ఎవరూ నమ్మరన్నారు. కేవలం రాజకీయ లబ్దికోసమే, హైకమాండ్ ఆదేశాల మేరకే కామారెడ్డి లో బండి సంజయ్ డ్రామాకు తెరలేపాడని ధ్వజమెత్తారు.
చేతనైతే సిలిండర్ ధర తగ్గించు..
బండి సంజయ్ కి చేతనైతే కేంద్రంతో మాట్లాడి గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని, వ్యవసాయ రంగం మీద వేసే పన్నులు తగ్గించాలని, ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ కి 15లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తామన్న మోదీతో ఆ పని వెంటనే చేయించాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించి దమ్ముంటే మెడికల్ కాలేజీలు తీసుకురా..! అంటూ సవాల్ విసిరారు. రైతుల రక్తాన్ని పీల్చే రాకాసి పార్టీ బీజేపీ అని, వారి మాయ మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకునే రైతు ప్రభుత్వం తెలంగాణలో ఉందని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులెవరూ దిగులు పడొద్దని హామీ ఇచ్చారు.