శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్నాళ్లుగా టీటీడీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా దేవాలయాలు నిర్మిస్తుండగా.. అందులో ఒకటి సిరిసిల్లలో ఏర్పాటు చేయడం గమనార్హం.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునఃనిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి భూమి పూజ చేశారు.
తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్నాళ్లుగా టీటీడీకి అనుబంధంగా దేశవ్యాప్తంగా దేవాలయాలు నిర్మిస్తుండగా.. అందులో ఒకటి సిరిసిల్లలో ఏర్పాటు చేయడం గమనార్హం. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున భూకేటాయింపులు చేయగా.. టీటీడీ నిధులతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
తెలంగాణలో వెంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తెలుగు భక్తులు పాల్గొనాలనే లక్ష్యంతోనే కొత్త గుడులను కడుతున్నట్లు చెప్పారు.
కేటీఆర్ గొప్ప నాయకుడు..
తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ గొప్ప నాయకుడు అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. యువ మంత్రిగా ఎన్నో పెట్టుబడులు తీసుకొని వస్తున్నారని ఆయన చెప్పారు. టీటీడీ తరపున ఆలయాల అభివృద్ధి కోసం నిధులు అడగగా.. తెలంగాణలో మేము ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజల గుండెల్లో ఉండేలా సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్ కూడా పని చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.