గాజాపై దాడులను ఖండించిన మంత్రి కేటీఆర్
గాజాలో జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్రమైన మానవత్వ సంక్షోభం ఏర్పడుతున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గాజాలోని ఆసుపత్రిపై బాంబు దాడి కారణంగా వందలాది మంది పౌరులు మరణించారనే వార్త చాలా బాధాకరమైనది. గత రెండు వారాలుగా జరుగుతున్న దాడుల కారణంగా దాదాపు 4,500 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధపడుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇజ్రాయేల్-హమాస్ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం గాజా స్ట్రిప్‌లో ఆందోళనకరమైన పరిస్థితి నెలకొన్నది. ఈ దాడుల్లో వందలాది మంది అమాయక ప్రజలు బలైపోయారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
ఇరు వర్గాల చర్యలు సమర్థించడం చాలా కష్టమైనది. గాజాలో జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్రమైన మానవత్వ సంక్షోభం ఏర్పడుతున్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని, అక్కడి ప్రజలకు అవసరమైన మానవతా సాయం అందించాలనే పిలుపుకు తాను మద్దతుగా నిలుస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. విచక్షణారహితమైన హింసకు దూరంగా ఉండటమే ఇరు వర్గాలకు చాలా కీలకమని మంత్రి చెప్పారు.
పాలస్తీనా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మార్గం కోసం చర్చలు చేపట్టాలని.. అంతే కాకుండా దౌత్యపరమైన సయోధ్యకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో ఇజ్రాయేల్ భద్రతా సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఐక్యరాజ్య సమితి తక్షణమే జోక్యం చేసుకొని సామరస్యపూర్వక తీర్మానానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 500 మంది పౌరులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ఇజ్రాయేల్-హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా వేలాది మంది అమాయక పౌరులు మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని కోరుతున్నాయి.