ఆ రెండు పార్టీలతో మాకు పోటీ లేదు: మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక విషయంలో మొదటి నుంచి చక్రం తిప్పుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సభలో మునుగోడు అభివృద్ధి, సంక్షేమంపై తప్పకుండా ప్రకటన చేస్తారని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ తమకు అసలు పోటీనే కాదని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని దూరం పెట్టి.. కేవలం తన అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని మంత్రి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 20న నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని.. సీఎం కేసీఆర్ ఇందులో పాల్గొంటారని మంత్రి వెల్లడించారు.
మునుగోడు ఉపఎన్నిక విషయంలో మొదటి నుంచి చక్రం తిప్పుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి విపక్షాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సభలో మునుగోడు అభివృద్ధి, సంక్షేమంపై తప్పకుండా ప్రకటన చేస్తారని చెప్పారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ 50 వేల మెజార్టీ సాధిస్తుందని జోస్యం చెప్పారు. రాజకీయ పార్టీ అన్నాక ఎంతో మంది టికెట్లు ఆశించడం సహజమని, టీఆర్ఎస్‌లో కూడా భారీగా ఆశావహులు ఉన్నారు. కానీ ఎలాంటి అసంతృప్తి లేదని మంత్రి వెల్లడించారు. మాది గెలిచే పార్టీ కాబట్టే ఆశావహులు ఎక్కువగా ఉన్నారన్నారు.
ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ ఏ మాత్రం పోటీ కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అధికార పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని.. ఈ వలసలు ఉపఎన్నిక తర్వాత కూడా కొనసాగుతాయని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఉపఎన్నిక విషయంలో నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని.. అక్కడ ఎగిరేది గులాబీ జెండానే అని పునరుద్ఘటించారు. సీఎం ఎవరిని నిలబెడితే వారిని గెలిపించుకునేందకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు.
నల్గొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారి నుంచి కాపాడింది సీఎం కేసీఆరే అని మంత్రి గుర్తు చేశారు. జిల్లా ప్రజలను ఆ మహమ్మారి నుంచి కాపాడటానికే మిషన్ భగీరథను తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. సొంత పార్టీతో సహా ఇతర పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసి, సమయమంతా వృధా చేయడం తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. కేవలం రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వస్తుందని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ఓడించి అభివృద్దికి పట్టం కట్టాలని మంత్రి జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.