ప్రీతి కుటుంబానికి మంత్రి ఓదార్పు.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన హరీశ్ రావు
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి, ఆమె కుటుంబ సభ్యులను వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదవుతున్న ప్రీతి ప్రమాదకరమైన ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ప్రీతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలియజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారడంతో ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి, ఆమె కుటుంబ సభ్యులను వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు. ప్రీతికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందంతో కాసేపు సమీక్ష నిర్వహించారు. ఆమెకు అత్యున్నత వైద్యం అందించాలని.. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి.. ధైర్యం కోల్పోవద్దని.. అత్యున్నత వైద్యం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ స్థితికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని, ప్రీతికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
కాగా, ప్రీతి ఆత్మహత్యాయత్నంలో ర్యాగింగ్, లవ్ జీహాద్ వంటి కోణాలు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కాలేజీలో సీనియర్-జూనియర్ మధ్య ఉన్న బాసిజం కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని.. అదే ఆత్మహత్యకు పురికొల్పిందని ఆయన వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‌ను ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని.. ప్రీతి ఫోన్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు.