కాలిపోయే మోటర్లు, కరెంటు కటకటలు, కరువులు, కర్ఫ్యూలు
కాంగ్రెస్ గత పాలన అంతా కాలిపోయే మోటర్లు, కరెంటు కటకటలు, కరువులు, కర్ఫ్యూలేనని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు.
కాంగ్రెస్ గత పాలన అంతా కాలిపోయే మోటర్లు, కరెంటు కటకటలు, కరువులు, కర్ఫ్యూలేనని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డితో కలసి ఆయన సభలో పాల్గొన్నారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కోసం సన్నాహక సభగా దీన్ని నిర్వహించారు. 15వ తేదీన మేనిఫెస్టోను ప్రకటించిన అనంతరం, 16వ తేదీన జనగామ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. కేసీఆర్ కు జనగామ అంటే ప్రేమ అని, అందుకే ఇక్కడ సభ పెడుతున్నారని చెప్పారు హరీష్ రావు. జనగామలో జరిగే సీఎం మీటింగ్ కి లక్షమంది హాజరయ్యేలా చూడాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
జనగామలో 2001లోనే ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. జనగామలో గెలిచేది పక్కా గులాబీ జెండానేనని చెప్పారు. ఆ జెండానే ఢిల్లీని కదిలించిందన్నారు. నిండు మనసుతో దీవించడమే బీఆర్‌ఎస్ క్రమశిక్షణ అని అన్నారు. కాంగ్రెస్ వారి మూటలు, మాటలు అన్నీ కుర్చీల కోసమేనన్నారు. కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని అభివృద్ధిని 11 సంవత్సరాల్లోపే కేసీఆర్ చేసి చూపించారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కైలాసం నుంచి పెద్దపాము మింగితే కిందపడ్డట్టేనని చెప్పారు.
జనగామలో బీఆర్‌ఎస్ గెలుపు విషయంలో డౌటే లేదని.. భారీ మెజారిటీ రావాలన్నారు మంత్రి హరీష్ రావు. ఈ మీటింగ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా.. పల్లా విజయానికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి కాళ్లకు పల్లా నమస్కారం చేయడం ఆసక్తిగా మారింది. ఇకపై జనగామలో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండవని, రెండు వర్గాలు ఒకటైపోయాయని స్పష్టమైంది. ఇద్దరు నేతలు సభా వేదికపైనుంచి చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు.