ప్రాజెక్టులకు అనుమతుల్లో ఆలస్యంతో తెలంగాణకు నష్టం

వెంటనే అనుమతులు ఇప్పించేలా చర్యలు చేపట్టిండి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి హరీశ్‌ రావు లేఖ

Advertisement
Update:2025-01-27 16:44 IST

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు నిధులివ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కు లేఖ రాశారని ఇది ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన గోదావరి, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులతో పాటు ఏ ఒక్క అనుమతి కూడా ఈ ప్రాజెక్టుకు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అడిషనల్‌ టీఎంసీ ప్రణాళికను పెండింగ్‌లో పెట్టారని, సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి ఇవ్వకుండా ఆరు నెలల నుంచి జాప్యం చేస్తున్నారని తెలిపారు. సమ్మక్క సాగర్‌ కు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌వోసీ ఇచ్చేలా కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపైనా దృష్టి సారించాలని కోరారు. కేంద్రం తెలంగాణ పంపిన ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో తెలంగాణలో సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగు పడ్డాయన్నారు. గోదావరిలో తెలంగాణ నీటి హక్కులు కాపాడేందుకు కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.

Tags:    
Advertisement

Similar News