గొప్ప మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్.. ముగ్గురు వికలాంగ అమ్మాయిలకు సాయం

మంత్రి కేటీఆర్ సూచనలతో మేయర్ వెంకటరెడ్డి.. డాక్టర్ విజయలక్ష్మిని వెంటబెట్టుకొని బాధితుల ఇంటికి వెళ్లారు. అక్కడ ముగ్గురు ఆడపిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు అక్కడి నుంచే ఫోన్ చేసి వివరించారు.

Advertisement
Update:2022-12-04 17:44 IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో సారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తాను ప్రజల నాయకుడినని.. సాయం కోసం ఎవరైనా 'అన్నా'.. అని పిలిస్తే వెంటనే పలుకుతానని నిరూపించుకున్నారు. శారీరిక వైకల్యంతో బాధపడుతున్న ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఒక్క ట్వీట్ పెట్టిన వెంటనే ఏకంగా మేయర్, డాక్టర్‌ను వారింటికి పంపి సాయం అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముల్లంగారి పెంటయ్య, శకుంతల దంపతులు నివశిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ ఆడపిల్లలు పుట్టుక నుంచే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా శారీరిక వైకల్యం వారి జీవనాన్ని దుర్భరంగా మార్చింది. కుమార్తెల ఆరోగ్యం బాగుపడాలని ఈ కుటుంబం ఇప్పటి వరకు ఎన్నో ఆసుపత్రులు తిరిగింది. మరో వైపు ఆర్థిక సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో చికిత్స అందించలేక పోయారు.

తమ అనారోగ్యం కారణంగా తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు భారంగా మారడంతో ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఇటీవల చనిపోవాలని కూడా అనుకున్నారు. తమకు దాతలు ఎవరైనా సాయం చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శివ ముదిరాజ్ అనే వ్యక్తి వీరి దీన పరిస్థితిని వివరిస్తూ ట్వీట్ చేశారు. దానికి మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ముగ్గురు ఆడపిల్లల అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ.. సాయం చేయాలని కేటీఆర్‌ను కోరారు.

ఎవరైనా సాయం కోరితే వెంటనే స్పందించే గుణం ఉన్న కేటీఆర్.. ఈ ముగ్గురు ఆడపిల్లల విషయంలో కూడా ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ఆ ట్వీట్ చూసిన వెంటనే పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డిని అప్రమత్తం చేశారు. వెంటనే ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని కోరారు. వెంకటరెడ్డి వెంటనే జెనెటిక్ డిసీజెస్‌లో నిపుణులైన డాక్టర్ వెంకటలక్ష్మిని తీసుకొని వెళ్లారు. దీనికి సంబంధించి కేటీఆర్ 'మేయర్ జక్కా వెంకటరెడ్డి, డాక్టర్ విజయ లక్ష్మిని ఈ రోజు ఉదయం ఆ ఇంటికి పంపించాను. వెంకట రెడ్డి మంచి మనసుతో తన సొంత డబ్బు రూ. 1 లక్ష సాయం అందించారు. ఈ కుటుంబానికి వైద్య సాయం అందిస్తాను' అంటూ ట్వీట్ చేశారు.

ఫోన్‌లో పరామర్శించి.. సాయం చేస్తానన్న కేటీఆర్..

మంత్రి కేటీఆర్ సూచనలతో మేయర్ వెంకటరెడ్డి.. డాక్టర్ విజయలక్ష్మిని వెంటబెట్టుకొని బాధితుల ఇంటికి వెళ్లారు. అక్కడ ముగ్గురు ఆడపిల్లల పరిస్థితిని తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు అక్కడి నుంచే ఫోన్ చేసి వివరించారు. ఆ కుటుంబంతో పాటు ముగ్గురు ఆడపిల్లల పరిస్థితిని వాకబు చేశారు. ఆ ముగ్గురు ఆడపిల్లల సమస్య ఏంటని కేటీఆర్ కనుక్కున్నారు. జెనెటిక్ సమస్యల కారణంగా వయసు పెరుగుతున్నా కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నట్లు వెంకటరెడ్డి వివరించారు. డాక్టర్ విజయలక్ష్మితో కూడా కేటీఆర్ మాట్లాడారు. ఆ పిల్లలకు వచ్చిన వ్యాధి వివరాలు అడిగారు. జెనెటిక్‌కు సంబంధించిన టెస్టులు చేయించాలని ఆమె అన్నారు. ఆ తర్వాత చికిత్స మొదలు పెట్టవచ్చని మంత్రికి తెలిపారు. ఆ ముగ్గురు ఆడపిల్లల వైద్యం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ విజయలక్ష్మిని మంత్రి కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు. మేయర్ వెంకటరెడ్డితో పాటు తాను కూడా అండగా ఉంటాను, వ్యక్తిగతంగా ఈ కేసును డీల్ చేయమని మంత్రి కోరారు.

కుటుంబంలో ఎంత మంది ఉన్నారని కేటీఆర్ అడిగారు. ఐదుగురు పిల్లలు ఉన్నారని, ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నా.. ముగ్గురు మాత్రం ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు మేయర్ చెప్పారు. వారికి పెన్షన్లు వస్తున్నాయా అని అడగ్గా.. ఒకరికి వస్తున్నట్లు చెప్పారు. మిగిలిన ఇద్దరికి కూడా పెన్షన్ వచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వారికి కనీస అవసరాలకు పెన్షన్లు ఉపయోగపడతాయిన కేటీఆర్ చెప్పారు.

ఆ పిల్లలు చదువుకొని ఉంటే ఉద్యోగాలు చూద్దాం.లేదంటే షాపు గానీ ఇతర ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పిద్దాము. మీరు (వెంకటరెడ్డి) ఇకపై వారి గార్డియన్‌గా ఉండండి. మనందరం వారికి అండగా నిలబడదామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇంత త్వరగా స్పందించినందుకు వెంకటరెడ్డిని అభినందించారు. ఒక్క ట్వీట్‌తో ఆ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కేటీఆర్ మరోసారి ఆయన మంచి మనసును చాటుకున్నారని పొగుడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News