ఆ ఫ్రిడ్జ్, టీవీ బదులు బీజేపీ వాషింగ్ మిషన్ కొనాల్సింది..
సోరెన్, బీజేపీ చెప్పినమాట వింటే, బీజేపీ పెద్దలకు సాగిలపడిపోతే.. ఆయనపై ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు. ఈ విషయాన్నే కేటీఆర్ సెటైరిక్ గా చెప్పారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసు విషయంలో ఈడీ, కోర్టుకి సమర్పించిన ఆధారాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. హేమంత్ సోరెన్ పై చార్జ్ షీట్ నమోదు చేసిన ఈడీ.. సాక్ష్యాలుగా ఫ్రిడ్జ్, స్మార్ట్ టీవీ కొనుగోళ్లకు సంబంధించిన రశీదుల్ని కూడా సమర్పించింది. ఈ ఆధారాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇప్పుడు కేటీఆర్ కూడా వాటిని పనికిమాలిన ఆధారాలని పేర్కొన్నారు. వాటి బదులు సోరెన్, బీజేపీ వాషింగ్ మిషన్ కొన్నా బాగుండేదని సెటైర్లు పేల్చారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరి వర్గం నేతలు బీజేపీలో చేరితే మాత్రం వారిపై కేసులుండవు, దర్యాప్తు ఏజెన్సీల కక్షసాధింపులుండవు. చాలా మంది విషయంలో ఇది రుజువైంది. అంటే బీజేపీ వాషింగ్ పౌడర్ అంత బ్రహ్మాండంగా పనిచేస్తుందని, వారి మరకలన్నీ తొలగిస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వాషింగ్ పౌడర్ తోపాటు బీజేపీ వాషింగ్ మిషన్ కూడా వారి అవినీతిని ఉతికి ఆరేస్తుందనేది కేటీఆర్ ట్వీట్ లోని అంతరార్థం. సోరెన్, బీజేపీ చెప్పినమాట వింటే, బీజేపీ పెద్దలకు సాగిలపడిపోతే.. ఆయనపై ఎలాంటి కక్షసాధింపులు ఉండేవి కావు. ఈ విషయాన్నే కేటీఆర్ సెటైరిక్ గా చెప్పారు.
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలంటున్నారు. సోరెన్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కూడా ఇటీవల ఈడీ అరెస్ట్ చేసి జైలుకి తరలించింది. వరుస అరెస్ట్ లతో ప్రతిపక్షాల్లో ఆందోళన మొదలైంది. లోక్ సభ ఎన్నికల వేళ వైరి వర్గాన్ని కట్టడి చేసేందుకే ఈ అరెస్ట్ లు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. బీజేపీ ఎంత కవర్ చేసుకోవాలని చూసినా.. ఆ పార్టీ కండువా కప్పుకున్న అవినీతి నేతల్ని దర్యాప్తు సంస్థలు ఉత్తములుగా ట్రీట్ చేయడమే ఇక్కడ విశేషం. ప్రత్యర్థి పార్టీల నేతలపై మాత్రం సోదాలు, దాడులు ఆగడంలేదు.