కాంగ్రెస్ తెచ్చిన మార్పు అదే.. కేటీఆర్ సెటైర్లు..

ఢిల్లీలో మోదీ.. ఇక్కడ కేడీ.. ఇద్దరూ మోసగాళ్లేనని సెటైర్లు పేల్చారు కేటీఆర్. అలాంటివారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు.

Advertisement
Update:2024-04-26 07:50 IST

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న కాంగ్రెస్ 100 రోజుల్లోనే మార్పు తీసుకొచ్చిందని, అయితే ఆ మార్పు ప్రజలకు ఉపకారం చేసేదిగా లేదని, వారిని ఇబ్బందుల్లోకి నెట్టిందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరెంటు, తాగునీరు, సాగునీరు ఇవ్వకపోవడమే కాంగ్రెస్‌ తెచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి మోసపోతే.. మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి మళ్లీ వారి చేతిలోనే మోసపోతే.. తప్పు మనదే అవుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నకేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


ఢిల్లీలో మోదీ.. ఇక్కడ కేడీ.. ఇద్దరూ మోసగాళ్లేనని సెటైర్లు పేల్చారు కేటీఆర్. అలాంటివారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మోసం పార్ట్‌–1 చూపిస్తే ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్ట్‌–2 చూపిస్తున్నారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు కాగానే ఆగస్టు-15లోగా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి దేవుడిపై ఒట్టు పెడుతున్నారని, కుటుంబ సభ్యులపై ఎందుకు ఒట్టు పెట్టడంలేదని నిలదీశారు. దేవుడు ఏమీ అనడు కాబట్టి, మళ్లీ మోసం చేసేందుకు ఆయనపై ఒట్టు పెడుతున్నారని అన్నారు కేటీఆర్. రైతుబంధు ఇవ్వలేని నాయకుడు, రూ.40 వేల కోట్లు రుణ మాఫీ చేస్తాడా ? అని ప్రశ్నించారు కేటీఆర్.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే, వారిపై ఒత్తిడి పెరగాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. 10 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తే.. కేసీఆర్‌ మళ్లీ రాజకీయాలను శాసిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ బండి సంజయ్‌ ఒక్క గుడికి నిధులు తేలేదని, ఒక్క బడికి అనుమతులు తీసుకు రాలేదని, అమిత్‌షా చెప్పులు మోసేందుకైతే ఆయనకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పులు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఆత్మహత్యలు మొదలయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి కారణం అని విమర్శించారు కేటీఆర్. సిరిసిల్లను మళ్లీ ఉరిసిల్లగా మార్చారని ధ్వజమెత్తారు. 

Tags:    
Advertisement

Similar News