కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా
లీగల్ నోటీసులకు సమాధానం చెప్పకపోవడంతో పిటిషన్ దాఖలు
మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. నాంపల్లి స్పెషల్ కోర్టులో కేటీఆర్ తరపున ఆయన అడ్వొకేట్ ఉమామహేశ్వర్ రావు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు బాల్క సుమన్, సత్యవత రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ ను సాక్షులుగా పేర్కొన్నారు. కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, సినీ తారల జీవితాలతో కేటీఆర్ ఆటలాడుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. వాటిపై మంత్రి స్పందిస్తూ.. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని మీడియా ఎదుట డిమాండ్ చేశారు. కొండా సురేఖ చేసిన నిరాధార ఆరోపణలతో తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీశారని, చట్టప్రకారం మంత్రిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ లో మంత్రిపై నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోంది. ఆ పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే కేటీఆర్ మంత్రిపై పిటిషన్ దాఖలు చేశారు.