టేక్ కేర్ జగనన్నా..! కేటీఆర్ ట్వీట్
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని కేటీఆర్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాళ్లదాడి రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలు జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. టేక్ కేర్ జగనన్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ వేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇలాంటి దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ ట్వీట్ వేశారు. ఆయన ఆరోగ్యం కోసం తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు చంద్రబాబు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులైన అధికారులను శిక్షించాలని కోరారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఈ దాడి ఘటనపై స్పందించారు. "జగన్‌పై దాడి, ఆయన ఎడమ కంటిపై గాయం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఖండించాల్సిందే. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా." అన్నారు షర్మిల.