ఎంతో చేశాం, అయినా ఓడిపోయాం.. ఆత్మ విమర్శ చేసుకుందాం
కేసీఆర్ పర్యటన వీడియోలు చూస్తుంటే నల్లగొండలో ఎలా ఓడిపోయామా అనిపించిందన్నారు కేటీఆర్. ఎన్నికల ముందు కూడా నల్లగొండ జిల్లాలో జరిగిన సభలకు జనాలు బ్రహ్మాండగా వచ్చారని, జిల్లాలో ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసుకున్నట్టు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా ఆత్మవిమర్శ చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్లగొండ లోక్ సభ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు. కేసీఆర్ పర్యటన వీడియోలు చూస్తుంటే నల్లగొండలో ఎలా ఓడిపోయామా అనిపించిందన్నారు. ఎన్నికల ముందు కూడా నల్లగొండ జిల్లాలో జరిగిన సభలకు జనాలు బ్రహ్మాండగా వచ్చారని, జిల్లాలో ఏడెనిమిది అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసుకున్నట్టు చెప్పారు. కానీ ఫలితాలు వేరేలా వచ్చాయని దీనిపై ఆత్మ విమర్శ చేసుకుందామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలన్నారు కేటీఆర్.
కొన్నిచేయలేకపోయాం..
భారతదేశంలోనే అత్యధికంగా లక్షా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినా కూడా యువత మనసు గెలుచుకోలేకపోయామని చెప్పారు కేటీఆర్. 100 రోజుల పాలనలో 30 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని రేవంత్ రెడ్డి అంటున్నారని, అసలు నోటిఫికేషనే ఇవ్వకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారో ఆయనే చెప్పాలన్నారు. 73శాతం జీతం పెంచినా, ఒకటోతేదీ జీతం అనే ప్రచారం నమ్మి.. ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారని, పోస్టల్ బ్యాలెట్లలో 70నుంచి 80 శాతం బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పడ్డాయని చెప్పారు కేటీఆర్. రైతుబంధు ఆర్థిక సాయం, 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. అయినా కూడా రైతులు బీఆర్ఎస్‌కు దూరం అయ్యారన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతాన్ని పెంచిపోషించిన కాంగ్రెస్ ని నమ్మారు కానీ, దాన్ని తరిమికొట్టిన బీఆర్ఎస్ ని మాత్రం ప్రజలు నమ్మలేకపోయారన్నారు. కాంగ్రెస్ నాయకులు మెడికల్ కాలేజీలు తీసుకు రాలేకపోయారని, బీఆర్ఎస్ హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ఓటమి ప్రజల తప్పు కాదని, నాయకులదే తప్పని అన్నారు కేటీఆర్.
డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారని.. రుణమాఫీ అయినవాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలని, మోసపోయినవాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 110 రోజులయినా రైతుబంధు రాలేదని, అదేమని అడిగితే చెప్పుతో కొట్టమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు కేటీఆర్. మరో మంత్రి ఉత్తమ్ రైతుబంధు దుబారా అంటున్నారని.. వారందరికీ రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. నల్లగొండ జిల్లాకు మంచి పనులు చేసిన బీఆర్ఎస్ ని లోక్ సభ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు కేటీఆర్.