సీఎంకి చెరోవైపు మేమున్నాం.. కోమటిరెడ్డి బ్రదర్స్ భారీ ఎలివేషన్లు
ఇప్పుడే ఆట మొదలైందని.. రేవంత్ రెడ్డికి ఇరు వైపులా కోమటిరెడ్డి బ్రదర్స్ నిలబడి ఉన్నామని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కోమటిరెడ్డి బ్రదర్స్ తో రేవంత్ రెడ్డికి పెద్దగా సఖ్యత లేదు. ఆ మాటకొస్తే తెలంగాణ కాంగ్రెస్ లో చాలామందికి రేవంత్ రెడ్డి విరోధిగానే కనిపించేవారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం అంతా సైలెంట్ అయ్యారు. రేవంత్ పై పల్లెత్తు మాట అనడంలేదు, అలాగని మరీ రాసుకు పూసుకు తిరగడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రం పూర్తిగా మారిపోయారు. మంత్రి పదవి పొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సలార్ మూవీలో పాటను ఎడిట్ చేయించి తాను రేవంత్ కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా హోం మినిస్టర్ పోస్ట్ కోసం సీఎంకు ఎక్కడలేని ఎలివేషన్లు ఇస్తున్నారు. తాజాగా భువనగిరి ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరూ పోటీపడి సీఎం రేవంత్ ని ఆకాశానికెత్తేశారు.
రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, సోదరసమానుడని అన్నారు మంత్రి వెంకట్ రెడ్డి. 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడమే వృథా అని అన్నారు వెంకట్ రెడ్డి. తనకు రాజకీయంగా పునర్జన్మ, రాజగోపాల్ రెడ్డి కి రాజకీయ జన్మ ఇచ్చింది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పారు. పోరాటాల ఖిల్లా, కాంగ్రెస్ కంచుకోట భువనగిరిలో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ కు పోటీ లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా.. వంద రోజులకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు వెంకట్ రెడ్డి.
ఇప్పుడే ఆట మొదలైందని.. రేవంత్ రెడ్డికి ఇరు వైపులా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నామని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న పొరపాటుతో ఒక్క సీటు కోల్పోయామని.. ఈ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం కచ్చితంగాతమదేనన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు కోమటి రెడ్డి బ్రదర్స్.