బీఆర్ఎస్ గెలిస్తేనే అవన్నీ జరుగుతాయి -కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉందో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, అభివృద్ధి కుంటుపడిందని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కనీసం డజను స్థానాల్లో బీఆర్ఎస్ గెలిస్తే లోక్ సభలో మనం కొట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవచ్చని అన్నారు. "గోదావరి, కృష్ణా నీళ్లు మనవి మనకే ఉండాలన్నా.. మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా.. కళ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా.. అనేక ఫ్యాక్టరీలు మన పటాన్‌చెరుకు రావాలన్నా మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలి. బీఆర్ఎస్ డజనుకుపైగా స్థానాల్లో గెలిస్తేనే పార్లమెంటులో మనం కీలక పాత్ర పోషిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం." అని అన్నారు కేసీఆర్. పటాన్ చెరులో జరిగిన మీటింగ్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
దేవుడిచ్చిన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోనని అన్నారు కేసీఆర్. ప్రజలే తనకు అండదండ, ప్రజలే తనకు ఇన్‌స్పిరేషన్, ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారాయన. బీఆర్‌ఎస్ ఉన్నప్పుడు పెట్టిన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా పరిశ్రమలు పెరిగాయని, దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులకు ఇక్కడ ఉపాధి లభించిందని వివరించారు. పటాన్ చెరు ఒక పరిశ్రమల హబ్ గా తయారైందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని.. మనతోపాటు ఇతర రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ పనులు దొరికాయని, అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఉపాధి తగ్గిపోయిందన్నారు కేసీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పడిపోయిందన్నారు కేసీఆర్. అనుమతులకోసం చదరపు అడుగుకి రూ.75 ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారని.. దీంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉందో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. గతంలో పటాన్ చెరు ప్రజలు కలుషిత జలాలు తాగేవారని, మన హయాంలో మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.