5 లక్షల మందితో బీఆర్ఎస్ మెగార్యాలీ.. ఏప్రిల్ 14న ముహూర్తం

పరేడ్ గ్రౌండ్స్ సభ, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించనున్నారు.

Advertisement
Update:2023-03-05 11:22 IST

బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దేశవ్యాప్తంగా సభలు, ర్యాలీలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖమ్మం, మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఏర్పాటు చేసిన సభలు మెగా సక్సెస్ అయ్యాయి. అదే ఊపులో హైదరాబాద్‌లో కూడా 5 లక్షల మందితో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి రోజే ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఇక అదే రోజు నగరంలో ర్యాలీతో పాటు పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. వాస్తవానికి ఫిబ్రవరి 17న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవంతో పాటు, భారీ సభను ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కోడ్ అమలులోకి రావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

అయితే ఏప్రిల్ 14న కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం మాత్రం ఉండబోదని తెలుస్తున్నది. ఆ రోజు మంచి ముహూర్తం లేని కారణంగా దానిని వేరే రోజు ఓపెన్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ సభ, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించనున్నారు. దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు దళిత సంఘాలకు చెందిన నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తున్నది. ఈ నాయకులను స్వయంగా ఆహ్వానించడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీశ్ కుమార్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, హెచ్‌డీ కుమార స్వామి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్, సీపీఐ నేత డి. రాజా, సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు ఇతర దళిత నేతలు కూడా హాజరవుతారని.. అక్కడ దళిత బంధు లబ్దిదారులకు యూనిట్ల పంపిణీ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News