తెలంగాణలో కెయిన్‌స్టెక్ పెట్టుబడి.. 2 వేల మందికి ఉపాధి
సంస్థ ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. తెలంగాణలో అవుట్ సోర్స్‌డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, కంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పేరుమోసిన కెయిన్‌స్టెక్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధుల బృందం మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది. తెలంగాణలో అవుట్ సోర్స్‌డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, కంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు మంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఆ సంస్థ ప్రతినిధుల బృందం ఎంఓయూ కుదుర్చుకుంది. రూ. 2,800 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కెయిన్‌స్టెక్ ప్రకటించింది. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. కెయిన్‌స్టెక్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
ఫాక్స్‌కాన్, కార్నింగ్ లాంటి ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కెయిన్‌స్టెక్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు.