'కరటక దమనకులు'.. కేసీఆర్ వాడిన ఈ పదం వెనుక అర్థం తెలుసా?
కేసీఆర్ ప్రయోగించిన 'కరటక దమనకులు' మాటకు అర్థం ఏంటంటే..
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతూనే.. మరోవైపు ప్రత్యర్థి నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ పార్టీలో ఉండి.. తీరా ఎన్నికల సమయంలో వేరే పార్టీలో చేరిన వారిని టార్గెట్ చేస్తున్నారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఇద్దరు నాయకులను ఉద్దేశించి 'కరటక దమనకులు' అంటూ సంభోదించారు. ఆ మాటకు అర్థం ఏంటో చాలా మందికి తెలియలేదు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద సభను నిర్వహించింది. ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యను గెలిపించాలని కోరారు. మంత్రి భట్టి నియోజకవర్గంలో దళిత బంధును భారీ స్థాయిలో అమలు చేస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అదే సమయంలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల గురించి సెటైర్లు వేశారు. వారి పేర్లు చెప్పకపోయినా 'కరటక దమనకులు' అంటూ సంభోదించారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించే ఈ మాట ప్రయోగించారు. సాధారణంగా ప్రెస్ మీట్లు, బహిరంగ సభల వేదికలపై ప్రత్యర్థులపై కాస్త ఘాటైన విమర్శలు చేయడం కేసీఆర్‌కు అలవాటు. కానీ వీరిద్దరినీ తిట్టడంలో మాత్రం ఒక తెలియని పదాన్ని వాడారు. అయితే దానికి అర్థం తెలిస్తే మాత్రం నవ్వు ఆపుకోలేము.
పరవస్తు చిన్నయ సూరి అనే పండితుడు చిన్నపిల్లల కథలు బాగా రాసేవారు. ఒకప్పుడు ఆయన రాసిన కథలను పిల్లలకు పెద్దలు వివరించేవారు. ఇప్పుడు అలా ఎవరూ చేయడం లేదు కదా. అయితే సాహిత్యంపై గొప్ప అవగాహన ఉన్న కేసీఆర్ మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి పద ప్రయోగాలు చేస్తుంటారు. చిన్నయ సూరి రాసిన కథలో కరటకుడు, దమనకుడు అనేవి రెండు పాత్రలు. అవి రెండు మోసం చేసే జిత్తులమారి నక్కలుగా చిన్నయ సూరి చిత్రించాడు.
ఆ రెండు నక్కలు తెలివిగా ఉంటూ, ఎదుటి వారిని మోసం చేయడంలో చాలా దిట్ట. అంతే కాకుండా అద్భుతంగా నటిస్తుంటాయి కూడా. అలాంటి మోసపూరిత నక్కల పేర్లను అడ్డం పెట్టి తుమ్మల, పొంగిలేటిని తిట్టేశారు. పెద్దగా వివరించకుండానే వారి మనస్తత్వం 'కరటక దమనకులు' వంటి జిత్తులమారి నక్కలని తేల్చిపారేశారు. ఇదీ కేసీఆర్ ప్రయోగించిన ఆ పదానికి అసలు అర్థం.