బీఆర్ఎస్‌కు యువరక్తం.. కేసీఆర్ నిర్ణయం

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో ప్రధాన పదవులు వారికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం.

Advertisement
Update:2024-07-07 13:14 IST

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుస ఓటములతో కేసీఆర్‌ దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్‌ పార్టీలో అధికారం అనుభవించిన నేతలు.. వరుసగా కారు దిగుతున్న నేపథ్యంలో పార్టీ ప్రక్షాళనకు అధినేత కేసీఆర్‌ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా యువతకు పార్టీలో పెద్దపీట వేయాలని గులాబీ బాస్‌ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేసింది గులాబీ పార్టీ హైకమాండ్‌. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలైన తర్వాత ఓటమిపై లోతైన విశ్లేషణ జరిపింది. పార్టీ సీనియర్‌ నాయకులు, కేడర్‌తో పాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి నివేదికలు, సమాచారాన్ని తెప్పించుకుంది. దశాబ్ధ కాలంగా పార్టీ, పాలన పరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదికల ద్వారా కేసీఆర్‌కు సూచనలు అందినట్లు సమాచారం. నివేదికల్లో సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత కీలక నేతలతో చర్చించిన కేసీఆర్.. పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో ప్రధాన పదవులు వారికే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం. ఇక ఉద్యమ సమయంలో అండగా నిలిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను తిరిగి దగ్గరికి చేర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా వేదికగా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆ విభాగాన్ని పటిష్టం చేస్తామని ఇటీవలే కేసీఆర్ ప్రకటించారు. ఆగస్టులో పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించే యోచనలో ఉన్నారు కేసీఆర్.

దాదాపు రెండు దశాబ్ధాలు తెలంగాణ రాజకీయాల్లో కీరోల్ ప్లే చేసింది బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం, వారికి కీలక పదవులు ఇవ్వడం, ఉద్యమ సమయంలో సహకరించిన వారిని దూరం పెట్టడం పార్టీకి తీవ్ర నష్టాన్ని చేసింది. ఇక జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ చేసిన హడావుడి, పార్టీ పేరు మార్పు కూడా ప్రస్తుత పరిస్థితికి కొంత కారణం.

Tags:    
Advertisement

Similar News