కేసీఆర్ అసలు ప్లాన్ ఇదేనా ?
జాతీయపార్టీ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. బహుశా బహిరంగ సభ విజయవాడలో కానీ లేదా వైజాగ్ లో కానీ నిర్వహించే అవకాశముంది.
జాతీయపార్టీ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. బహుశా బహిరంగ సభ విజయవాడలో కానీ లేదా వైజాగ్ లో కానీ నిర్వహించే అవకాశముంది. అంతా బాగానే ఉంది కానీ కేసీఆర్ అసలు ప్లాన్ ఏమిటి ? అనే చర్చకూడా మొదలైంది. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉంచటమే అసలు ఉద్దేశ్యంగా కనబడుతోంది.
ఈ రెండుపార్టీలు తెలంగాణా రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా, తనకు వ్యతిరేకంగ ఎలాంటి పావులు కదపకుండా ముందుజాగ్రత్తగా మాత్రమే కేసీఆర్ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నది ఇన్ సైడ్ టాక్. కేసీఆర్ కున్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో కన్నా తెలంగాణాలో ముందే జరుగుతాయి. 2023లో తెలంగాణాలో షెడ్యూల్ ఎన్నికలుంటే ఏపీలో 2024లో జరుగుతాయి.
వచ్చే ఎన్నికలు కేసీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. జాతీయపార్టీ పెట్టినంతమాత్రాన జాతీయస్ధాయిలో కేసీఆర్ ఏదో వెలిగిపోతారనే భ్రమల్లో ఎవరూ లేరు. అయితే జాతీయస్ధాయిలో ఎలాగున్నా రాష్ట్రంలో ఓడిపోతే మాత్రం పరిస్ధితి ఇబ్బందికరంగా మారిపోతుంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలంటే ఇటు చంద్రబాబు అయినా అటు జగన్ అయినా తెలంగాణా రాజకీయాలను ఏరకంగా కూడా ప్రభావితం చేయకూడదని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు.
ఒకవేళ తన ఆలోచనలకు భిన్నంగా చంద్రబాబు లేదా జగన్ నడుచుకుంటే అప్పుడు జాతీయపార్టీ అధ్యక్షుడి హోదాలో తాను కూడా వాళ్ళని ఏపీలో ఇబ్బందులు పెట్టడానికి రంగం రెడీ చేసుకుంటున్నారు. తన పార్టీ తరపున అభ్యర్ధులను పోటీకి దింపి ప్రత్యర్ధులను టార్గెట్ చేయటమే కేసీఆర్ అసలు వ్యూహంగా అర్ధమవుతోంది. అంతేకానీ కేసీఆర్ పార్టీ తరపున పోటీచేస్తే జనాలు పోలోమంటు ఓట్లేసేసి అభ్యర్ధులను గెలిపిచేస్తారని అనుకోవటంలేదు. మొదటి ఎన్నికల్లో కేసీయార్ పార్టీకి డిపాజిట్లు దక్కితే అదే చాలా ఎక్కువనేది జనాల టాక్. దీన్నిబట్టి ఆ తర్వాత ఎన్నికల భవిష్యత్తు ఆధారపడుంటుంది. అంటే కేసీఆర్ ఆలోచనంతా కేవలం చంద్రబాబు, జగన్ కు ముందస్తు హెచ్చరికగానే అనుమానించాల్సుంటుంది.