గవర్నర్.... రాజకీయాలు

తెలంగాణ గవర్నర్ తమిళిసై కి రాష్ట్రప్రభుత్వానికి మధ్య ఏం జరుగుతోంది? గవర్నర్ ఈ మధ్య సాంప్రదాయాలను పక్కనపెట్టి ఎక్కువగా రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు ? ఇవి ఆమె వ్యక్తిగతమా లేక కేంద్ర నుండి వచ్చిన సూచనలా ?

Advertisement
Update:2022-07-26 12:41 IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ , తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మధ్య చాలాకాలంగా ఉప్పు నిప్పుగా ఉంది. ఆమె గవర్నర్ లా కాకుండా బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు టీఆరెస్ నాయకుల నుండి వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో నిన్న ఆమె ఢిల్లీలో ఫక్తు రాజకీయాలు మాట్లాడారు. ప్రైవేటు సంభాషణల్లో ఆమె ఏమైనా మాట్లాడవచ్చు కానీ మీడియాతో మాట్లాడినప్పుడు గవర్నర్ లా కాకుండా రాజకీయ నేతలా మాట్లాడటం విమర్శలకు తావిస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని, ఆయన పార్టీ పెట్టరని, ముందస్తు ఎన్నికలు కూడా రావని ఆమె అన్నారు. పైగా తెలంగాణలో వరద నష్టాలపై , కేంద్రం సహాయంపై టీఆరెస్ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారన్నట్టు ఆమె మాట్లాడారు. పైగా తెంగాణకు కేంద్రం ఎంత చేసింది.. ఏం చేసింది.. అనేది కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి లెక్కలతో సహా వివరించారు కదా అని తమిళిసై మీడియాతో అనడం విమర్శలకు దారితీసింది.

అసలు మొదట కొద్ది రోజులు మినహా ఈ గవర్నర్ పద్దతి మొత్తం ఇలాగే ఉందని టీఆరెస్ నాయకులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కొన్నింటికి కేసీఆర్ మద్దతు ఇచ్చినంత కాలం రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ సంబంధాలు మంచిగా ఉన్నాయి. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న వివక్ష మీద కేంద్ర ప్రభుత్వంపై యుద్ద‍ం ప్రకటించారో అప్పటి నుంచి ఆమె పద్దతే మారిపోయిందన్నది టీఆరెస్ నేతల ఆరోపణ.

ఆమె బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్షలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలను వ్యతిరేకించడం, ప్రభుత్వానికి పోటీగా కార్యకలాపాలు చేయడం ఎప్పటి నుంచో సాగుతున్న విషయాలు. అయితే ఒక గవర్నర్ ఇలా చేయవచ్చునా ? అసలు మన రాజ్యాంగం గవర్నర్ కు ఏ విధులను కల్పించింది ? మొదటి నుంచి మన దేశంలో కొనసాగుతున్న సాంప్రదాయమేంటి ?

మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచే గవర్నర్ల వ్యవస్థపై చర్చ సాగుతోంది. గవర్న‌ర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆ నాడు పార్లమెంటులో కూడా తీవ్ర చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసే గవర్నర్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నిర్దేశించగలరా అనే సమస్యపై ఆనాడు మహామహులు రాజ్యాంగ సభలో చర్చలు జరిపారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినట్టు గవర్నర్ కు అత్యధిక అధికారాలు ఇవ్వడాన్ని రాజ్యాంగ సభ ఆనాడే తిరస్కరించింది.

మంత్రిమండలి నిర్ణయాలను తోసిపుచ్చే అధికారం గవర్నర్లకు ఉండదని రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం… గవర్నర్‌కు స్వయంగా నిర్వర్తించే విధులు లేవని, ఆర్టికల్‌ 163 ప్రకారం, మంత్రివర్గం సలహాను గవర్నర్ తప్పక అంగీకరించాలని అంబేద్కర్‌ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం, శాంతిభద్రతలకు, ప్రశాంతతకు ముప్పు వాటిల్లి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు అసెంబ్లీని సమావేశపరచడమో లేక రద్దు చేయడమో తప్ప ఎలాంటి అధికారం గవర్నర్‌కు ఉండదని రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

గవర్నర్‌ అనేది నామినేటెడ్‌ పదవి అనీ, రాష్ట్రపతిలాగా ఎన్నుకోబడినది కాదు కనుక, ఎటువంటి విచక్షణ అధికారాలనైనా కలిగి ఉండటం రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధమనీ హెచ్‌.వి కామత్‌ రాజ్యాంగ సభ లో తెలిపారు.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసే గవర్నర్ల వ్యవస్థ పెద్దగా ఉపయోగం లేనిదని మొదటి నుంచీ ఒక అభిప్రాయం ఉన్నది. అయినా కేంద్రానికి, రాష్ట్రానికి వారధిలాగా ఉపయోగపడేందుకు గవర్నర్ల వ్యవస్థను ఏర్పాటుచేశారు. అయితే మొదటి నుంచి ఈ వ్యవస్థ వివాదాస్పదమవుతూనే ఉన్నది. 1959 లో కేరళలో ఈఎమ్ ఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని కేం ద్ర ప్రభుత్వం రద్దు చేసిన నాటి నుండే గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఈ దేశంలో ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని కూల దోసిన గవర్నర్ రాంలాల్ ను మర్చిపోలేం కదా !

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లను తమ స్వంత ఏజెంట్లుగా ఉపయోగించుకుంటారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఇది రాష్ట్రాల హక్కుల కాలరాయడమే అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టు ఇది ఫెడరల్ సూత్రాలకు పూర్తిగా విరుద్దం.

Tags:    
Advertisement

Similar News