ఎంపీగా పోటీ చేస్తా.. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి సంచలన వ్యాఖ్యలు..!
భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఇవ్వకపోవడం నిరాశ పరిచిందన్నారు నందిని. భట్టి లాంటి కమిట్‌మెంట్ ఉన్న లీడర్ కాంగ్రెస్‌లో లేరన్నారు. భట్టి సీఎం అయితే ఖమ్మం జిల్లాతో పాటు యావత్ తెలంగాణకు మేలు జరిగేదన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఖమ్మం ఎంపీ సీటు రేసులో మల్లు నందిని ఉన్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు మల్లు నందిని. ఖమ్మం ఎంపీగా తను పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజలు కోరిక మేరకు తను ఎంపీగా పోటీ చేయడాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు మల్లు నందిని. పారాచుట్ లీడర్లు ఎక్కువగా ఆశించొద్దన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకుని మంత్రులుగా పదవులు ఇచ్చామన్నారు. భట్టి విక్రమార్క పదేళ్లుగా కాపాడిన కేడర్ వాళ్ల గెలుపు కోసం కృషి చేసిందన్నారు. దీంతో వారు సంతృప్తి చెందాలన్నారు నందిని. తుమ్మల కుమారుడు, పొంగులేటి సోదరుడు ఖమ్మం ఎంపీ సీటు రేసులో ఉన్నారన్న నేపథ్యంలో మల్లు నందిని వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఇవ్వకపోవడం నిరాశ పరిచిందన్నారు నందిని. భట్టి లాంటి కమిట్‌మెంట్ ఉన్న లీడర్ కాంగ్రెస్‌లో లేరన్నారు. భట్టి సీఎం అయితే ఖమ్మం జిల్లాతో పాటు యావత్ తెలంగాణకు మేలు జరిగేదన్నారు. ఏం జరిగినా మంచికే అని యాక్సెప్ట్ చేశామని..దానికి ఎదురుతిరగలేం కాబట్టి వచ్చిన దానిని స్వీకరించామన్నారు నందిని.