ఆర్డీఎస్ తూములు మూసేస్తే సుంకేశుల బ్యారేజ్ పేల్చేస్తా అని వార్నింగ్ ఇచ్చా : సీఎం కేసీఆర్

రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డీఎస్ వద్ద తూములు మూసేస్తామంటూ బెదిరించిన రోజే నాకు రక్తం మరిగింది. నువ్వు ఆర్డీఎస్ వద్ద అడుగు పెడితే.. సుంకేశుల డ్యామ్ పేల్చేస్తా అని హెచ్చరించానని కేసీఆర్ చెప్పారు.

Advertisement
Update:2023-09-16 19:58 IST

కృష్ణా నది నుంచి తెలంగాణకు రావల్సిన వాటానే తీసుకుంటున్నాము. ఆంధ్రా ప్రజలారా పాలమూరు-రంగారెడ్డి నుంచి మా నీళ్లే మేం తీసుకుంటున్నాము. అంతే తప్పా.. మీ నీళ్లు దోచుకోవడం లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒకనాడు తెలంగాణ సరిహద్దులో 1954లో కట్టిన ఆర్డీఎస్‌ను ఆంధ్రా పాలకులే నాశనం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తొలి సారి ఆర్డీఎస్‌ వద్దకే పాదయాత్ర చేసి.. ఆర్డీఎస్ తూములు మూసేస్తే మళ్లీ బాంబులు పెట్టి నేనే పేల్చేస్తానని గట్టిగా హెచ్చరించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్‌రన్‌ను ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

రాయలసీమకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్డీఎస్ వద్ద తూములు మూసేస్తామంటూ బెదిరించిన రోజే నాకు రక్తం మరిగింది. నువ్వు ఆర్డీఎస్ వద్ద అడుగు పెడితే.. సుంకేశుల డ్యామ్ పేల్చేస్తా అని హెచ్చరించాను. ఆ రోజు ఆగ్రహంతో అలా చెప్పినా.. పాలమూరు బిడ్డలు అర్థం చేసుకున్నారని కేసీఆర్ చెప్పారు. మనకు వాళ్లు గండం కాలేదు కానీ.. ఇంటి దొంగలే పాలమూరు ప్రాజెక్టుకు అడ్డం పడ్డారని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులను విమర్శించారు.

రాష్ట్రం వస్తేనే ఇలాంటి సకల దరిద్రాలు పోతాయని నేను భావించాను. మన హక్కులు, నీళ్లు మనకే ఉంటాయని చెప్పాను. ఈ రోజు మనం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము. ఒకప్పుడు పాలమూరు అంటే హైదరాబాద్ అడ్డాలో కూలీగా ఉండేవాడు. లేదంటే బొంబాయి వలస వెళ్లేవాడు. కానీ ఇప్పుడు పచ్చని పంట పొలాలతో పాలమూరు కళకళలాడుతోంది. స్థానికులు ఇక్కడే తమ పొలం పనులు చేసుకుంటున్నారు. పాలమూరు ముఖ చిత్రం మొత్తం తెలంగాణ వచ్చాక మారిపోయిందని కేసీఆర్ చెప్పారు.

1975లో బచావత్ తీర్పు ఇచ్చే సమయంలోనే మా జిల్లాకు నీళ్లు ఏవని పాలమూరు పాలకులు అడిగి ఉంటే ఇంత అన్యాయం జరిగేది కాదు. ఆంధ్రాతో తెలంగాణను కలపకుండా ఉంటే మహబూబ్‌నగర్ బాగుపడేదని ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ జడ్జిలే అన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. 17 టీఎంసీలతో జూరాల మంజూరు చేస్తున్నట్లు బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. కాకపోతే సాంకేతిక కారణాలు చెప్పి.. మేం చెప్పిన చోటే ప్రాజెక్టు కట్టాలని నిబంధన పెట్టారు. 1981 వరకు కూడా జూరాల ప్రాజెక్టు కోసం ఆంధ్రా పాలకులు తట్టెడు మట్టి తీయలేదు. తెలంగాణకు చెందిన అంజయ్య సీఎం అయ్యాకే జూరాలకు శంకుస్థాపన జరిగిందని కేసీఆర్ చెప్పారు.

2001లో టీఆర్ఎస్‌ను స్థాపించిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబును గట్టిగా ప్రశ్నిస్తే.. అప్పుడు గానీ జూరాల కాల్వ పనులు చేయించలేదని అన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీది మరో వైఖరి.. వాళ్లకు తెలంగాణ అంటే పట్టింపే లేదని అన్నారు. కృష్ణా నదిలో మా వాటా పంచమని ఎన్నిసార్లు కోరినా.. విశ్వగురు అని చెప్పుకునే ప్రధాని మోడీ.. ఇంత వరకు నోరు మెదపడం లేదు. రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచే లేఖను ట్రిబ్యునల్ ఇవ్వాలి. కేంద్రంలోని మోడీ మాత్రం కుయ్యుమనడు కయ్యిమనడు అని ఎద్దేవా చేశారు. ఇవన్నీ తెలవని కొంత మంది బీజేపీ పిల్లలు.. నేను వస్తుంటే కారుకు అడ్డంగా పడి జెండాలు పట్టుకుంటున్నారు. వీళ్లకు బుద్ది ఉంటే ఢిల్లీకి వెళ్లి క్రిష్ణా ట్రిబ్యునల్ నీటిని పంచమని మోడీని సిఫారసు చేయమని అడగండని కేసీఆర్ చెప్పారు.

కొల్లాపూర్‌కు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్ పట్టణానికి కొత్త పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేశారు. అంతే కాకుండా జిల్‌దార్‌తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవెన్ కెనాల్, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడెనింగ్, లైనింగ్, మల్లేశ్వరం మినీ లిఫ్ట్ కోసం అధికారుల చేత సర్వే చేయించి సాధ్యమైనంత త్వరలో పనులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రూ.10 కోట్లతో బోడగట్టు చెక్‌డ్యామ్‌కు రేపు జీవో విడుదల చేయిస్తామని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.15 లక్షల చొప్పున ప్రత్యేక ఫండ్‌ను ఇస్తాము. అలాగే మహబూబ్‌నగర్ పట్టణంలో జేఎన్టీయూ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News