కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు
కూకట్‌పల్లి నల్ల చెరువు, అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి ,పటేల్‌గూడ సర్వే నెంబర్ 12లలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు ఉన్నది. ఇందులో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50పైగా పక్కా భవనాలు, అపార్ట్‌మెంట్స్ నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. 16 షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది.
కూకట్‌పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తెల్లవారుజాము నుంచే కూల్చేసింది. శుక్రవారమే హైడ్రా అధికారులు చెరువును సందర్శించారు. వాస్తవాలను తనిఖీ చేసి అక్కడ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో పరిస్థితిని తెలుసుకున్నారు. ఇప్పటికే సేకరించిన ఉపగ్రహ ఛాయా చిత్రం, తాజాగా డ్రోన్ సర్వేలో వచ్చిన ఫొటోల ఆధారంగా ఆక్రమణల లెక్కలు బైటికి వచ్చాయి.
అమీన్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా విల్లాలు, అపార్ట్‌మెంట్స్, నిర్మించినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఉదయం నుంచే భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. పటేల్‌గూడ సర్వే నెంబర్ 12 లో అక్రమంగా నిర్మించిన 12 విల్లాలు, అపార్ట్‌మెంట్స్ ను హైడ్రా కూల్చివేసింది.
అలాగే అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధి కిష్టారెడ్డి పేటలోని అక్రమ నిర్మాణాలనూ హైడ్రా కూల్చివేసింది. 164 సర్వే నంబర్‌లోని మూడు బహుళ అంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది. కిష్టారెడ్డి పేటలో అక్రమంగా కట్టిన కిడ్స్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి బిల్డింగ్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. కూల్చివేతల సందర్భంగా ఎలాంటి ఆందోళనలకు ఆస్కారం లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చశారు. 500 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించలేదు.