మెట్రో మూడోదశ కీలక అప్ డేట్.. కన్సల్టెన్సీల పని మొదలు

మెట్రో రైల్ మూడో దశ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కన్సల్టెన్సీల ఎంపికకు పిలిచిన టెండర్లలో 5 కంపెనీలు బిడ్లు సమర్పించాయి. వీటిలో ఆర్వీ అసోసియేట్స్‌, సిస్ట్రా, యూఎంటీసీ, రైట్స్‌ సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయి.

Advertisement
Update:2023-09-03 10:48 IST

హైదరాబాద్ మెట్రో మూడో దశకు సంబంధించి కీలక అప్ డేట్ ఇది. మూడో దశ ప్రాథమిక ప్రాజెక్ట్ నివేదిక(PPR), డిటెయిల్డ్ ప్రాజెక్ట్ నివేదిక(DPR) లకు సంబంధించి కన్సల్టెన్సీలను ఎంపిక చేసింది మెట్రో యాజమాన్యం. ఈ కన్సల్టెన్సీల పని మొదలైంది. రెండు నెలల్లో ఈ సంస్థలు PPR సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు నెలల్లో DPR సమర్పించాల్సిందిగా ఆ రెండు కంపెనీలను మెట్రో యాజమాన్యం సూచించింది.

ఐదు సంస్థల పోటీ..

మెట్రో రైల్ మూడో దశ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం కన్సల్టెన్సీల ఎంపికకు పిలిచిన టెండర్లలో 5 కంపెనీలు బిడ్లు సమర్పించాయి. వీటిలో ఆర్వీ అసోసియేట్స్‌, సిస్ట్రా, యూఎంటీసీ, రైట్స్‌ సంస్థలు సాంకేతిక అర్హత సాధించాయి. వీటిలో ఆర్వీ అసోసియేట్స్‌ సంస్థ సాంకేతికంగా అధిక మార్కులు పొందింది. మొత్తం 4 ప్యాకేజీల్లోనూ అతి తక్కువ ఆర్థిక బిడ్‌ లు దాఖలు చేసింది. టెండర్‌ నిబంధనల ప్రకారం ఆర్వీ అసోసియేట్స్‌ కి రెండు ప్యాకేజీలు, మిగిలిన రెండు ప్యాకేజీలను రెండో స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థకు కేటాయించింది హైదరాబాద్ మెట్రో.

నివేదికలు ఇలా..

ట్రాఫిక్‌ సర్వే, ట్రాఫిక్ రద్దీ అంచనా, రవాణా వ్యవస్థల విశ్లేషణ వంటివి PPRలో ఉంటాయి. దీనిపై రెండు నెలల్లో ఆయా సంస్థలు నివేదికలు ఇవ్వాల్సి ఉంటాయి. ఆ తర్వాత DPR పనులు మొదలవుతాయి. రైలు అలైన్‌ మెంట్‌, వయాడక్ట్‌, స్టేషన్లు, డిపోలు, విద్యుత్‌ వ్యవస్థ, సిగ్నలింగ్‌, రైల్వే సమాచార వ్యవస్థ, రైలు బోగీలు, పర్యావరణం, చార్జీల పట్టిక, ప్రాజెక్టు అమలు విధానం వంటి విషయాలపై సవివరణ ప్రాజెక్టు నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం కన్సల్టెన్సీ సంస్థలను వివిధ కారిడార్‌ లలో వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని ఆదేశించామని మెట్రో యాజమాన్యం తెలిపింది.

Tags:    
Advertisement

Similar News