ఉప్పొంగిన మూసీ.. మరో రెండురోజులు భారీ వర్షాలు..

బ్రిడ్జ్ లు దాటుకుని మూసీ ప్రవహిస్తోంది. అంబర్‌ పేట-కాచిగూడ, మూసారాంబాగ్‌- మలక్‌ పేట మధ్య మూసీ ప్రవాహం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement
Update:2022-07-27 21:11 IST

గోదావరి తర్వాత కృష్ణా నదికి వరదలు వస్తాయని అనుకున్నారంతా, కానీ అనూహ్యంగా మూసీ ఉప్పొంగింది. ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్ లో చాలా రోజుల తర్వాత బ్రిడ్జ్ లు దాటుకుని మూసీ ప్రవహిస్తోంది. అంబర్‌ పేట-కాచిగూడ, మూసారాంబాగ్‌- మలక్‌ పేట మధ్య మూసీ ప్రవాహం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ లో పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మరో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్వాల్‌, కుత్బుల్లాపూర్‌, కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నట్టు తెలిపింది.



నిండు కుండల్లా జంట జలాశయాలు..

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్‌కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్‌ లో పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగుల కాగా, ప్రస్తుతం 1761.9 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌ లోకి ఇన్ ఫ్లో 8,000 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10,700 క్యూసెక్కులుగా ఉంది. 8 గేట్లు ఎత్తి మూసీకి నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.10 అడుగుల నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 8,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 8,281 క్యూసెక్కులు. ఉస్మాన్ సాగర్ 13 గేట్లు ఎత్తి మూసీకి నీటిని విడుదల చేస్తున్నారు.



భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో ఔటర్ రింగ్ రోడ్ పై వరద నీరు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరిస్తున్నారు అధికారులు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ముందస్తుగా మూసీనది ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి సామర్థ్యం 637.5 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 2.67 టీఎంసీలుగా కొనసాగుతోంది.



యాదాద్రి జిల్లా బీబీ నగర్‌ మండల పరిధిలో మూసీ ప్రవాహానికి రుద్రవల్లి, భూదాన్‌ పోచంపల్లి మండలం జూలురు గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవ్‌ బ్రిడ్జి పైనుంచి మూసీ ఉరుకులు పరుగులు పెడుతోంది. బ్రిడ్జి కి ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వలిగొండ మండలం భీమలింగం వద్ద కూడా​ వంతెనపై మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భువనగిరి మండలం, భుల్లేపల్లి, వలిగొండ మండలం, సంగెం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

Tags:    
Advertisement

Similar News