తెలంగాణ వ్యాప్తంగా కుండపోత.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద నదీ ప్రవాహం 48 అడుగుల మేరకు చేరింది. పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రవాహ స్థాయి మరింత పెరుగుతుందని అంచనా.

Advertisement
Update:2023-07-27 07:17 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌ లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. జూన్‌ 1 నుంచి బుధవారం నాటికి 313.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 33 మిల్లీమీటర్లు అధికంగా వర్షం కురిసింది. నల్గొండ జిల్లా మినహా రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో అత్యంత అధిక వర్షపాతం, 21 జిల్లాల్లో అధిక వర్షపాతం, ఆరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి జిల్లా కర్కగూడెంలో అత్యధికంగా 22.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

మరో రెండురోజులు కుండపోత..

వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ. ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజులపాటు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. దక్షిణ తెలంగాణ మొత్తం ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి..

అటు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇటీవల తొలి ప్రమాదహెచ్చరిక ఉపసంహరించుకోగా.. ఇప్పుడు తొలి ప్రమాద హెచ్చరికతోపాటు, రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని కూడా దాటి ప్రవహిస్తోంది గోదావరి. భద్రాచలం వద్ద నదీ ప్రవాహం 48 అడుగుల మేరకు చేరింది. పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కొనసాగుతున్నందున ప్రవాహ స్థాయి మరింత పెరుగుతుందని అంచనా. గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News