కోమటిరెడ్డి.. ఇదేనా ప్రజాపాలన - హరీష్‌ రావు

సందీప్‌ రెడ్డిని బయటకు పంపాలంటూ మంత్రి కోమటిరెడ్డి పోలీసులకు హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు హరీష్‌ రావు.

Advertisement
Update:2024-01-29 18:53 IST

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, భువనగిరి జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి మధ్య జరిగిన వివాదంపై స్పందించారు BRS నేత హరీష్‌ రావు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమన్నారు. మొన్న రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండని పిలుపునిచ్చిన కోమటిరెడ్డి.. ఇవాళ అధికారిక కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌ రెడ్డిని అకారణంగా దుర్భాషలాడారని.. ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు హరీష్‌ రావు.


సందీప్‌ రెడ్డిని బయటకు పంపాలంటూ మంత్రి కోమటిరెడ్డి పోలీసులకు హుకుం జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు హరీష్‌ రావు. ప్రజాస్వామ్య వాదులంతా కోమటిరెడ్డి పోకడలను తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకమున్నా.. సందీప్‌ రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే.. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డితో పాటు స్థానిక జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి తాము ప్రజల కోసం పోరాటాలు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచామని.. సందీప్ రెడ్డి మాత్రం తన తండ్రి మాధవరెడ్డి పేరు చెప్పుకుని జడ్పీ ఛైర్మన్‌ అయ్యారంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలకు అడ్డుచెప్పిన సందీప్‌ రెడ్డి.. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న పోలీసులను పిలిచిన కోమటిరెడ్డి.. సందీప్‌ రెడ్డిని అక్కడి నుంచి పంపించాలంటూ వారికి ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News