ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? హరీష్ రావు ఘాటు లేఖ
టెట్ ఫీజులు భారీగా పెంచడంతోపాటు.. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు.
ప్రజా సమస్యలను సూటిగా ప్రస్తావిస్తూ, ప్రభుత్వం స్పందించాలంటూ లేఖల ద్వారా నిలదీస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాజాగా ఆయన టెట్ పరీక్ష ఫీజుల పెంపుపై ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఫీజులు పెంచారని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు.
బీఆర్‌ఎస్ హయాంలో టెట్ పరీక్ష ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 ఫీజు తీసుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న తొలి టెట్ పేపర్ కి వెయ్యి రూపాయలు ఫీజు వసూలు చేస్తుండటం విశేషం. అయితే ఇది ఒక్కో పేపర్ కి మాత్రమే. అంటే ఒక పేపర్ రాయాలంటే వెయ్యి రూపాయలు, రెండు పేపర్లు రాస్తే రెండు వేల రూపాయలు ఫీజు కట్టాలి. సీబీఎస్సీ నిర్వహించే సీటెట్‌తో పోల్చి చూసినా తెలంగాణ టెట్ ఫీజులు రెట్టింపు ఉన్నాయి. ఇదే విషయంపే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు హరీష్ రావు. అధిక ఫీజులు వసూలు చేయడం తగదన్నారు.
టెట్ ఫీజులు భారీగా పెంచడంతోపాటు.. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. టెట్ ఫీజులు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే నిరుద్యోగులతో కలసి నిరసనకు దిగుతామని హెచ్చరించారు. అధిక ఫీజులకు నిరసనగా బీఈడీ, డీఈడీ చదివిన వారు పోరాడుతున్నా, అభ్యర్థులు రోడ్లెక్కి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.