లగచర్ల లో నిజాలను తొక్కిపెడుతున్నారంటే తప్పు ఒప్పుకున్నట్టే
నిజ నిర్దారణకు వెళ్తున్న వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు.. ప్రభుత్వం పై కేటీఆర్, హరీశ్ రావు ఫైర్
వాళ్లు లగచర్ల కు వెళ్తే నిజాలు బయట పడుతాయనే ప్రభుత్వం భయపడుతుందా అని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రశ్నించారు. లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండ చేశారని నిజ నిర్దారణకు వెళ్తోన్న మహిళా, ప్రజా సంఘాల నాయకులపై దౌర్జన్యానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల లో వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోందని నిలదీశారు. సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి.. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..లేక లగచర్ల.. చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా చెప్పాలన్నారు. పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారని, కొడంగల్ వెళ్లే అన్ని దారుల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారన్నారు. మీరెంత దాచే ప్రయత్నం చేసినా నిజం దాగదని, లగచర్లలో కాంగ్రెస్ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరిందన్నారు. దేశ రాజధానిలో ఈ ప్రభుత్వ అరాచకపర్వంపైనే తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే ప్రభుత్వం తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే అన్నారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్ రావు అన్నారు. ఇదేనా మీరు చెప్పిన ఏడో గ్యారెంటీ అయిన ప్రజాస్వామ్య పాలన అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నరని కానీ, అవి లేకుండా ఈ పాలనలో రోజు గడవడం లేదన్నారు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటరు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంత మంది నోళ్ళు మూయిస్తరని ప్రశ్నించారు. అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నడు. నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.