బీఆర్ఎస్‌ టూ కాంగ్రెస్‌.. మరో నలుగురు జంప్!

వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సైతం ఇవాళ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వరంగల్ ఎంపీ టికెట్ తనకు కాకుండా కడియం కూతురు కావ్యకు ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
Update:2024-03-15 17:52 IST

ఎంపీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌ నేతలు అధికార కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీప్‌దాస్ మున్షీ ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు దానం నాగేందర్‌ను కలవడం.. ఇప్పుడు స్వయంగా ఆయనే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవడం హాట్‌ టాపిక్‌గా మారింది. దానం నాగేందర్‌ సొంతగూటికి వెళ్లడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సైతం ఇవాళ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వరంగల్ ఎంపీ టికెట్ తనకు కాకుండా కడియం కూతురు కావ్యకు ఇవ్వడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం చేవెళ్ల‌ ఎంపీగా ఉన్న రంజిత్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా అందుకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఆయన హస్తం పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌కు ఇంద్రకరణ్‌ డుమ్మా కొట్టడం ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇలా రెండుమూడు రోజుల్లో బీఆర్ఎస్‌ కీలక నేతలంతా కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారని టాక్.

ఇక ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారు దిగారు. నాగర్ కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్‌లో చేరారు. బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరారు.

Tags:    
Advertisement

Similar News