రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం
నిర్మల్ జిల్లా కేంద్రంలో కేబీబీవీలో కలుషిత ఆహారం కారణంగా 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
తెలంగాణలో సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన వరుసగా జరగటం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అనంతపేట్‌లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ హాస్టల్‌లో సిబ్బంది ఉడికీ ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అది తిని తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మొత్తం 10 మంది విద్యార్ధినులు కలుషిత ఆహార కారణంగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో విద్యార్థినులను చికిత్స నిమిత్తం నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో తిరిగి పాఠశాలకు పంపించారు. మరో ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంఈవోను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరారని, అన్నం వండటంలో సరైన అవగాహన లేక కొంత మేర ఉడకపోవడం, ఆ ఆహరాన్ని తినడం వల్లే విద్యార్థులు వాంతులు చేసుకున్నారని తెలుస్తోంది.