ఐదుగురిని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం
కర్నాటక రాష్ట్రం కార్వార్‌లో నేవీ ఉద్యోగిగా పనిచేస్తున్న దీపక్ సామల్.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి బదిలీ అయ్యారు. ఆయన సొంత రాష్ట్రం ఒడిశా. బదిలీ నేపథ్యంలో ఆయన కర్నాటక నుంచి భార్య, కుమార్తెతో కలసి కారులో విశాఖకు వస్తున్నారు.
రాయచూర్–కోదాడ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటక రాష్ట్రం కార్వార్‌లో నేవీ ఉద్యోగిగా పనిచేస్తున్న దీపక్ సామల్.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి బదిలీ అయ్యారు. ఆయన సొంత రాష్ట్రం ఒడిశా. బదిలీ నేపథ్యంలో ఆయన కర్నాటక నుంచి భార్య, కుమార్తెతో కలసి కారులో విశాఖకు వస్తున్నారు. అదే సమయంలో కర్ణాటక రాష్ట్రం సైదాపూర్‌కు చెందిన మడివాలప్ప, నీలహళ్లి ఖలీల్, మౌలాలీ, రహెమా బేగం కారులో వస్తున్నారు. వీరు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలానికి వైద్యం నిమిత్తం వచ్చి తిరిగి తమ ప్రాంతానికి వెళుతున్నారు.
లారీని ఓవర్‌టేక్ చేయబోయి..
దీపక్ సామల్ ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న మడివాలప్ప కారును వేగంగా ఢీకొట్టింది. జక్లేర్ స్టేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దీపక్ సామల్ భార్య భవిత సామల్(32), కుమార్తె అస్మిత సామల్ (7), మరో కారులోని నీలహళ్లి ఖలీల్ (36), మౌలాలీ (45), రహెమా బేగం (62) ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. దీపక్ సామల్, మడివాలప్ప తీవ్ర గాయాలపాలవ్వగా వారిని మక్తల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మక్తల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.