సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్
ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.
సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మోండా మర్కెట్ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తలకు దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి చెప్పులు, కుర్చీలు విసిరారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి లాఠీచార్జ్‌కి దారి తీసింది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపైకి కార్యకర్తలు చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో కార్యకర్తలను పోలీసులు చితకబాదారు.
మరోవైపు మతఘర్షణలు చెలరేగకుండా సికింద్రాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల , రాష్ట్రంలో అసాంఘిక శక్తులు పెరిగాయని హిందూ సంఘాలు తెలిపాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన హిందువులను ఆగ్రహానికి గురిచేసింది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ముంబయికి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.