ముగిసిన నామినేషన్ల పరిశీలన.. బాబుమోహన్, మందా జగన్నాథంలకు షాక్
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అఫిడవిట్‌పై కాంగ్రెస్, బీఎస్పీ, బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేశారు. చివరకు ఆయన నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు.
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 893 మంది నామినేషన్లు వేయగా.. 267 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి బాబుమోహన్‌లకు అధికారులు షాకిచ్చారు. నాగర్‌కర్నూలు BSP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మందా జగన్నాథం. అయితే బీఫాం సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అక్కడ మరో అభ్యర్థి BSP తరపున నామినేషన్ వేశారు.
ఇక మాజీ మంత్రి బాబు మోహన్ వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం.. ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ అఫిడవిట్‌పై కాంగ్రెస్, బీఎస్పీ, బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేశారు. చివరకు ఆయన నామినేషన్‌ను అధికారులు ఆమోదించారు.
మొత్తంగా 267 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా.. అత్యధికంగా మల్కాజ్‌గిరిలో 77 మంది నామినేషన్లు, నల్గొండ 25, కరీంనగర్ 20, హైదరాబాద్ 19, చేవెళ్ల 17, పెద్దపల్లి, జహీరాబాద్‌లలో 14 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అతి తక్కువగా మెదక్‌లో ఒకరి నామినేషన్‌ను తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన పూర్తికావడంతో ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉంది.