కేసీఆర్ ఇలాకాలో ఈటల.. చేరికల పేరుతో హడావిడి

కేసీఆర్ పై పగతో వస్తున్నారే కానీ, గజ్వేల్ పై ప్రేమతో కాదనే విషయం అందరికీ తెలుసు. గెలిచినా, ఓడినా ఈటల హుజూరాబాద్ ని వదిలి వచ్చేది లేదు. అలాంటప్పుడు ఆయనకు ఓటెందుకు వేయాలనేది గజ్వేల్ వాసుల ఆలోచన.

Advertisement
Update:2023-10-25 12:17 IST

కేసీఆర్ ఇలాకాలో ఈటల.. చేరికల పేరుతో హడావిడి

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో దిగుతున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆయన తొలిసారిగా గజ్వేల్ వస్తున్నారు. రేపు ర్యాలీ, బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతే కాదు, గజ్వేల్ లో బీజేపీలో చేరికలంటూ ఈటల హడావిడి చేయడానికి రెడీ అయ్యారు. ఇంతకీ కేసీఆర్ ఇలాకాలో ఈటల చేయగలిగిందేంటి..? చేస్తున్నదేంటి..?

ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల.. కేవలం కేసీఆర్ తో పోటీపడటం కోసమే గజ్వేల్ లో కూడా నామినేషన్ వేస్తున్నారు. కేసీఆర్ ని ఓడించడం అటుంచితే.. ముందు హుజూరాబాద్ లో గెలవడం ఈటలకు ముఖ్యం. అందుకే ఆయన పేరుకి ఇక్కడి అభ్యర్థి అయినా.. ప్రచారమంతా హుజూరాబాద్ లోనే చేస్తారు. కానీ నామినేషన్లకు ముందు గజ్వేల్ లో కాస్త హడావిడి చేయాలనుకుంటున్నారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్త నాయకులను ఆయన కలవబోతున్నారు. వారికి కాషాయ కండువా కప్పి తమవైపుతిప్పుకోబోతున్నారు. ఈ చేరికలతో బీఆర్ఎస్ కి వచ్చే నష్టమేమీ లేదు కానీ, బీజేపీ మాత్రం ఒకింత ప్రచారం దక్కించుకునే అవకాశముంది. ఆ ప్రచారం కోసమే ఈటల చెమటోడుస్తున్నారు.

2018 ఎన్నికల్లో గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కి వచ్చిన ఓట్లు 1,25,444. అంటే దాదాపు 61 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. ఈసారి బీజేపీ తరపున ఈటల, కాంగ్రెస్ తరపున తూముకుంట నర్సారెడ్డి పోటీకి దిగుతున్నారు. ఈ త్రిముఖ పోరులో కేసీఆర్ ఓట్లు తగ్గే అవకాశం లేదని అంటున్నారు. రాగా పోగా కాంగ్రెస్ ఓట్లు చీలి, బీజేపీకి పడే ఛాన్స్ ఉందంటున్నారు. గెలిచినా, ఓడినా ఈటల హుజూరాబాద్ ని వదిలి వచ్చేది లేదు. అలాంటప్పుడు ఆయనకు ఓటెందుకు వేయాలనేది స్థానికుల ఆలోచన. కేసీఆర్ పై పగతో వస్తున్నారే కానీ, గజ్వేల్ పై ప్రేమతో కాదనే విషయం అందరికీ తెలుసు. పగ ప్రతీకారం అంటూ ఈటల.. హుజురాబాద్ ని పణంగా పెడతారా..? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అదే నిజమైతే.. గజ్వేల్ లో గల్లంతై, హుజూరాబాద్ చేజారితే అది ఈటల స్వయంకృతాపరాధమే అవుతుంది. 

Tags:    
Advertisement

Similar News