తెలంగాణలో బీజేపీ స్పీడ్ తగ్గింది.. అధిష్టానానికి అదే చెప్పాం

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పొరుగు రాష్ట్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు డీలాపడ్డాయని అన్నారు ఈటల, రాజగోపాల్ రెడ్డి.

Advertisement
Update:2023-06-25 06:54 IST

ఢిల్లీలో తెలంగాణ బీజేపీ పంచాయితీ శనివారం మొదలైంది. ఈరోజు రెండో ఎపిసోడ్ కూడా ఉంది. అయితే ఈ గ్యాప్ లో మీడియా ముందుకొచ్చిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానంతో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. తెలంగాణలో బీజేపీ స్పీడ్ తగ్గిందని, ఆ విషయం పార్టీ పెద్దలకు కూడా తెలుసని చెప్పారు. తాము కూడా తెలంగాణలో పార్టీ పరిస్థితులను నిర్మొహమాటంగా వివరించామని అన్నారు.

కారణాలేంటంటే.?

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత పొరుగు రాష్ట్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు డీలాపడ్డాయని అన్నారు ఈటల, రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నామే కానీ, ఆ పార్టీ నాయకుల అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల జనాల్లో బీజేపీ పలుచబడిందని అంటున్నారు. బీఆర్ఎస్ ని ఢీకొట్టాలంటే, ఆ పార్టీ నేతలపై ఉదారంగా ఉంటే లాభం లేదని అధిష్టానానికి వివరించారు.

బేరసారాలు జరగలేదు..

తెలంగాణ బీజేపీలో పదవులు లేనందున ఈటల, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని, అందుకే వారిని బుజ్జగించడానికి ఢిల్లీ పిలిపించారని, పనిలో పనిగా కిషన్ రెడ్డిని కూడా ఢిల్లీకి రమ్మన్నారనే వార్తలొచ్చాయి. అయితే అధిష్టానం ముందు తామేమీ డిమాండ్లు ఉంచలేదని చెబుతున్నారు ఈటల, రాజగోపాల్ రెడ్డి. తమ సామర్థ్యానికి తగ్గట్టు అధిష్టానమే తమల్ని వాడుకోవాలని చెప్పామన్నారు. పదవులిచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణలో బీజేపీ గెలుపుకి కృషిచేస్తామన్నారు.

ఈరోజు సెకండ్ ఎపిసోడ్..

తెలంగాణలో బీఆర్ఎస్ హవా ఈసారి కూడా కొనసాగుతుందని సర్వేలు చెబుతున్నాయి. పైగా కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయమంటూ బీజేపీ గొప్పలు చెప్పుకుంటోంది. కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ ప్రచారం చేస్తోంది బీజేపీ. కానీ కాషాయదళంలో సీనియర్లు మాత్రం పక్కచూపులు చూస్తున్నారు. దీంతో అధిష్టానం కాస్త తొందరపడింది. అసంతృప్తుల్ని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈరోజు ఈటల, రాజగోపాల్ రెడ్డితో సెకండ్ ఎపిసోడ్ బుజ్జగింపుల పర్వం జరుగుతుంది. ఆతర్వాత మరికొందర్ని ఢిల్లీకి పిలిపించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News