చంద్రయాన్.. మన హైదరాబాదీ షాన్
చంద్రయాన్-3లో వాడిన ప్రతి విడిభాగమూ మన నేల మీద తయారైందే. ఇందులో మన హైదరాబాద్‌లో నెలకొని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎండీఎన్ఎల్, బీహెచ్ఈఎల్ కీలకపాత్ర పోషించడం మరింత గర్వకారణం.
చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నీరాజనాలందుకుంటోంది మన భారతదేశం. ఈ ప్రయోగంతో ఇస్రో సత్తా ప్రపంచానికి మరోమారు తెలిసింది. దీంతోపాటు మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం చంద్రయాన్-3లో వాడిన ప్రతి విడిభాగమూ మన నేల మీద తయారైందే. ఇందులో మన హైదరాబాద్‌లో నెలకొని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎండీఎన్ఎల్, బీహెచ్ఈఎల్ కీలకపాత్ర పోషించడం మరింత గర్వకారణం.
మేడిన్ ఇండియా
పూర్తిగా భారత్‌లో తయారైన పరికరాలనే చంద్రయాన్ -3లో వినియోగించామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చేసిన ప్రకటన దేశంలో మేడిన్ ఇండియా నినాదంతో ముందుకెళుతున్న ప్రభుత్వానికి మంచి కితాబు. మేకిన్ ఇండియా నినాదంతో ముందుకెళుతున్న మన దేశానికి ఇదో మంచి బూస్ట్.
మన బీహెచ్ఈఎల్, ఎండీఎన్ఎల్
మన మెట్రో రైల్ వేసిన ఎల్ అండ్ టీ తన ఏరోస్పేస్ విభాగంతో చంద్రయాన్- 3ని ప్రయోగించిన లాంచ్ ప్యాడ్‌ను సిద్ధం చేసింది. ఎంతో కీలకమైన బూస్టర్లను తయారుచేసి ఇచ్చింది. టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (టీసీఈ) దేశంలోనే తయారుచేసిన క్రిటికల్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్‌ను రాకెట్ వేగాన్ని ప్రొపెల్లంట్ ప్లాంట్‌లోనూ, మొబైల్ లాంచ్ పెడస్టల్‌లోనూ చంద్రయాన్-3కి అందజేసింది. మన హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (ఎండీఎన్ఎల్) రాకెట్ లాంచ్ వెహికల్‌కు అవసరమైన కోబాల్ట్ బేస్ ఎల్లాయ్స్, నికెల్ బేస్ ఎల్లాయ్స్, టైటానియమ్ ఎల్లాయ్స్‌ను తయారు చేసింది. మనకు బీహెచ్ఈఎల్‌గా సుపరిచితమైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ చంద్రయాన్-3కి అవసరమైన భారీ బ్యాటరీలను తయారుచేసింది. అంతేకాదు బీహెచ్ఈఎల్‌లోని వెల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) బై మైటాలిక్ ఎడాప్టర్లను అందజేసింది.
*