సోనియా గాంధీ సహకారం.. పీవీకి భారతరత్న - రేవంత్ రెడ్డి
పీవీ ప్రధానమంత్రిగా ఎన్నికవడానికి, పరిపాలన సజావుగా సాగడానికి సోనియా గాంధీ సహకరించారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏకైక తెలుగు ప్రధాని పీవీకి భారతరత్న రావడం తెలుగువారందరికి గర్వకారణమన్నారు రేవంత్ రెడ్డి. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి ఇండియాను ప్రపంచదేశాలతో పోటీ పడే విధంగా పీవీ తీర్చిదిద్దారని చెప్పారు రేవంత్. ఆలస్యమైనప్పటికీ పీవీకి భారతరత్న దక్కడం దేశప్రజలకు గర్వకారణమన్నారు.
పీవీకి భారతరత్న రావడంతో ఆయన కుటుంబసభ్యులు, ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్. ఇక పీవీ ప్రధానమంత్రిగా ఎన్నికవడానికి, పరిపాలన సజావుగా సాగడానికి సోనియా గాంధీ సహకరించారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్ల దాష్టికాలపై పోరాడి హైదరాబాద్ రాష్ట్ర విముక్తిలో పీవీ అత్యంత కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.
అయితే పీవీ ప్రధాని కావడానికి సోనియా సహకరించారంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేలుతున్నాయి. పీవీని సోనియా గాంధీ అవమానించారని, కనీసం పార్టీ ఆఫీసుకు సైతం ఆయన డెడ్‌బాడీని తీసుకెళ్లేందుకు సోనియా అనుమతించలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన స్మారకంగా స్థలం కూడా కేటాయించలేదని విమర్శిస్తున్నారు.