కాంగ్రెస్‌లో వర్గపోరు లేదంటూనే నోరుజారిన ఎంపీ కోమటిరెడ్డి

సీఎం రేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి తదితర పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Update:2023-05-24 10:37 IST

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు లేదంటూనే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నోరుజారారు. నల్గొండ జిల్లాలో కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్న ఎంపీ కోమటిరెడ్డి.. ఆ ఉత్సాహంలో మాట్లాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దాంతో లోలోపల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతోషపడి ఉండొచ్చు. కానీ.. వెంటనే అతనికి కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న వర్గపోరు గుర్తొచ్చినట్లుంది. దాంతో ‘‘నన్ను అలా అనొద్దు.. మీరు అలా అంటే అంతా కలిసి నన్ను ఓడిస్తారు’’ అంటూ నోరుజారారు. కానీ.. ఈ మాటలకి కొన్ని నిమిషాల ముందే అతను కాంగ్రెస్‌లో వర్గపోరు లేదంటూ బాహాటంగా చెప్పడం గమనార్హం.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం వచ్చింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బీరాలు పలుకుతున్నారు. కానీ.. పార్టీ విజయం సంగతి ఏమోకానీ.. సీఎం రేసులో మాత్రం చాలా మంది నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల కంటే సీఎం రేసులో ఉన్నవాళ్లే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి.

సీఎం రేసులో ఇప్పటికే రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి తదితర పేర్లు వినిపిస్తున్నాయి. రాబోవు రోజుల్లో ఈ ఆశావహుల జాబితాలోకి రేణుక చౌదరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క తదితరులు కూడా చేరే అవకాశాలూ లేకపోలేదు. వీళ్లంతా కోర్ కమిటీలో పనిచేసిన వారు. అలానే ఇటీవల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో చాలా క్లోజ్‌గా కనిపించారు.

వాస్తవానికి కాంగ్రెస్‌లో సీఎం కావాలంటే పార్టీని ముందుండి నడిపించాల్సిన పనిలేదు. ఢిల్లీలోని అధిష్టానం తలుచుకుంటే ఎవరైనా సీఎం కావొచ్చు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలను అప్పట్లో సీఎంగా ఎంపిక చేయడమే ఇందుకు ఉదాహరణ. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వారివి అనేలా తయారైంది కాంగ్రెస్‌లో పరిస్థితి. అయితే విషయం బయటికి వస్తే ప్రత్యర్థి కంటే పార్టీలోని వారితోనే ఎక్కువ ప్రమాదం. బహుశా అందుకే కాబోలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంతా కలిసి నన్ను ఓడిస్తారని భయపడ్డారు.

రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హింట్ ఇచ్చేశారు. నల్గొండ ప్రజలు తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్తూనే.. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెలలోనే తెలంగాణకి మరోసారి ప్రియాంక గాంధీ రాబోతున్నారు. అలానే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా తెలంగాణలోని కాంగ్రెస్ నేతల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు అధిష్టానం దృష్టిలో పడేందుకు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News