అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సీఎం రేవంత్
ఈరోజుతో మొదలయ్యే పర్యటన ఈనెల 14తో పూర్తవుతుంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్నారు. ఈరోజుతో ఆయన విదేశీ పర్యటన మొదలవుతుంది. ముందుగా ఆయన అమెరికాలోని న్యూయార్క్ కి చేరుకుంటారు. ఈనెల 14తో ఈ పర్యటన పూర్తవుతుంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
సీఎంతోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, అధికారులు జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ పర్యటనలో పాల్గొంటారు. ఈనె 5న న్యూయార్క్‌లో కాగ్నిజెంట్, సిగ్నా, ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్, జోయిటస్ సంస్థల ప్రతినిధులతో తెలంగాణ బృందం సమావేశమవుతుంది. 6వ తేదీన పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. వాషింగ్టన్ లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో కూడా ఈ బృందం సమావేశమవుతుంది.
అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ నేతలు సమావేశమవుతారు. 10వతేదీన అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి చేరుకుంటారు. యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్, సామ్‌సంగ్, ఎల్‌జీ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఈనెల 14న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.