పదేళ్లు సీఎంగా ఉండి మీకోసం పనిచేస్తా..

నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్ రావు అంటున్నారని.. ఉద్యోగాలు పొందిన యువత కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-02-14 20:27 IST

మాజీ సీఎం కేసీఆర్ పై తాజా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలిచ్చే బర్రెను ఇంటికి పంపి.. దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ అన్నారని.. వాస్తవానికి కంచర గాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందిని, పదేళ్లు ముఖ్యమంత్రి బాధ్యతలోనే ఉండి ప్రజల కోసం 24గంటలు కష్టపడి పనిచేస్తానని అన్నారాయన. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారని.. ఎలా వస్తారో తానూ చూస్తానని సవాల్ విసిరారు. కొత్తగా ఎంపికైన కానిస్టేబుళ్లకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు.


నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీష్ రావు అంటున్నారని.. ఉద్యోగాలు పొందిన యువత కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో.. యువతకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు కూడా అంతే సంతోషం కలుగుతోందన్నారు. "మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం." అని చెప్పారు రేవంత్ రెడ్డి. శాసనసభకు రమ్మంటే రాకుండా నల్గొండకు వెళ్లి కేసీఆర్ బీరాలు పలుకుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ మేడిపండు అని, పొట్టవిప్పితే అన్నీ పురుగులే ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణను కబళించడానికి గంజాయి ముఠాలు తిరుగుతున్నాయని విమర్శించారు.

స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరిపోతాయని నిరుద్యోగులు ఆశించారని, కానీ బీఆర్ఎస్ హయాంలో వారి ఆశలు నెరవేరలేదన్నారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన తొమ్మిదిన్నరేళ్లపాటు గత ప్రభుత్వానికి రాకపోవడం విచిత్రమేనన్నారు. తెలంగాణ యువత, నిరుద్యోగులు అధైర్యపడొద్దని.. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం. 

Tags:    
Advertisement

Similar News