పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ..

పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం ఉండదన్నారు రేవంత్‌రెడ్డి. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదని స్పష్టం చేశారు.

Advertisement
Update:2024-07-09 21:57 IST

తెలంగాణలో పోటీ పరీక్షల వాయిదాకోసం అభ్యర్థులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విద్యార్థుల మేలు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షలు వాయిదా వేయడం వల్ల అభ్యర్థులకు ఎలాంటి లాభం ఉండదని, కోచింగ్ సెంటర్లే అంతిమంగా లాభపడతాయని లాజిక్ చెప్పారు రేవంత్ రెడ్డి.


గ్రూప్స్ పరీక్షలు ఒక నెల రోజులు వాయిదా పడితే ఒక్కో కోచింగ్ సెంటర్ కి 100 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పరీక్షల వాయిదాకోసం ధర్నాలు చేస్తున్న వారి వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉందని, వారే ఈ ధర్నాలు, నిరసనలు చేయిస్తున్నానరని మండిపడ్డారాయన. బీఆర్ఎస్ నేతలు కూడా వీరిని రెచ్చగొడుతున్నారని చెప్పారు. అభ్యర్థులపై అంత సింపతీ ఉంటే బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగాలన్నారు. అమాయక విద్యార్థులను, పోటీ పరీక్షల అభ్యర్థులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూడటం సరికాదన్నారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లో అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక జరగాలని చేస్తున్న డిమాండ్ వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్‌లో ఆ నిబంధన లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని ప్రతిపక్షాలు కోర్టుకి వెళ్తాయని, అప్పుడు నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పదే పదే పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రతిపక్షం కుట్ర చేస్తోందన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం ఉండదన్నారాయన. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకే పరీక్షలు వాయిదా వేయడం లేదని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి.

Tags:    
Advertisement

Similar News