ఆ ఫైలు మీదే తొలి సంతకం.. కేసీఆర్ కీలక హామీ

యుద్ధం చేసెటోని చేతుల కత్తి పెడితే లాభం గానీ, వట్టోని చేతుల పెడితే ఏం లాభం. రేపు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ కావాలన్నా.. కొర్రీలు పెట్టుకుండా రైతుబంధు వేయాలన్నా మన BRS ప్రభుత్వం రావాలి

Advertisement
Update:2023-11-27 18:08 IST

కాంగ్రెస్ నేతలవి మతిలేని మాటలన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్ నిర్వ‌హించిన ప్ర‌జా ఆశీర్వాద‌ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. "అసైన్డ్ భూములకు పట్టాలిస్తమని మేం చెప్తుంటే కాంగ్రెసోళ్లు ఉల్టా ప్రచారం చేస్తున్నరు. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే అసైన్డ్‌ భూములను గుంజుకుంటదని అంటున్నరు. ఎందుకు గుంజుకుంటం..? ఈ పదేండ్లలో గుంజుకున్నమా..? అసైన్డ్‌ భూములను గుంజుకునుడు కాదు, ఎన్నికలు అయిపోంగనే తొలి క్యాబినెట్‌ భేటీలోనే అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే పనికే ఆమోదం తెలుపుతా" అని ఓటర్లకు హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు సీఎం కేసీఆర్. "రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు వేస్తున్నం. దురదృష్టం కొద్ది రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా ప‌రిహారం ఇస్తున్నం. రైతులు పండించిన పంటను 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నం. అంతా సాఫీగా సాగుతోంది. పనికిమాలిన కాంగ్రెస్ నేతల మాటలు పట్టించుకోకుండ్రి. రేవంత్‌ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు, 3 గంటలు చాలు అంటున్నడు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. అసలు రైతుకిస్తే, కౌలురైతుకు రైతు బంధు ఇయ్యం అంటున్నరు".

"మీరే ఆలోచన చేయండి. వ్యవసాయానికి 3 గంటల కరెంటు సాల్తదా..? కాంగ్రెస్సోళ్ల‌ను నమ్ముకుంటే అంతే సంగతులు. యుద్ధం చేసెటోని చేతుల కత్తి పెడితే లాభం గానీ, వట్టోని చేతుల పెడితే ఏం లాభం. రేపు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ కావాలన్నా.. కొర్రీలు పెట్టుకుండా రైతుబంధు వేయాలన్నా మన BRS ప్రభుత్వం రావాలి". అందుకోసం మన ఎమ్మెల్యేలందర్నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్.

Tags:    
Advertisement

Similar News