ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

Advertisement
Update:2023-08-07 18:24 IST

ప్రజా గాయకుడు గద్దర్ పార్దివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి.. ఘనంగా నివాళులు అర్పించారు. అల్వాల్‌లోని గద్దర్ ఇంటిలో ఉంచిన ఆయన మృతదేహాం వద్ద శ్రద్ధాంజలి ఘటించి.. వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, రసమయ బాలకిషన్, చంటి క్రాంతి కిరణ్, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న కూడా ఉన్నారు.

గద్దర్ మరణించిన తర్వాత ఆయన మృత దేహాన్ని ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ తర్వాత సోమవారం ఉదయం ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్‌లోని గద్దర్ నివాసం వరకు అంతిమయాత్ర చేపట్టారు. దాదాపు ఆరున్నర గంటల పాటు గద్దర యాత్ర కొనసాగింది. ఇందులో కళాకారులు, రచయితలు, కవులు, రాజకీయ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రజా యుద్ద నౌక గద్దర్‌ను కడసారి చూసేందుకు అభిమానులు అల్వాల్ చేరుకుంటున్నారు.

గద్దర మృత దేహానికి బౌద్ధ మత పద్దతుల్లో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇందుకోసం మహాబోధి స్కూల్‌లో ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరపనున్నారు. ఆ తర్వాత బౌద్ధ మతాచారం ప్రకారం ఖననం చేస్తారు. అనంతరం దాదాపు 40 నిమిషాల పాటు బౌద్ధ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.


Tags:    
Advertisement

Similar News